Begin typing your search above and press return to search.

ఈ కేంద్ర మంత్రి మాంసం తినొద్దంటున్నారే!

By:  Tupaki Desk   |   19 Sep 2017 7:23 AM GMT
ఈ కేంద్ర మంత్రి మాంసం తినొద్దంటున్నారే!
X
మాంసం తినొద్ద‌ని - తింటే త‌ర్వాత అది మిమ్మ‌ల్ని తినేస్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.. కేంద్ర మ‌హిళా - శిశు సంక్షేమ శాఖా మంత్రి మేన‌కా గాంధీ. ది ఎవిడెన్స్ -మీట్ కిల్స్ అనే చిత్రం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. మాంసం తింటే మాన‌వ శ‌రీరానికి క‌లిగే దుష్ప‌లితాల గురించి ఈ సినిమా వివ‌రిస్తుంద‌ని మేన‌క అంటున్నారు. ప్ర‌తి రోజూ మాంసం తింటే మాన‌వ శ‌రీరానికి మ‌రింత ప్ర‌మాదం త‌లెత్తుతుంద‌ని చెబుతున్నారు. అయితే మాంసం తింటే ప్రాణాలేమీ పోవ‌ని కాక‌పోతే కొన్నాళ్ల‌కు శ‌రీరం మాత్రం బ‌ల‌హీన‌మైపోతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

స్వ‌త‌హాగా జంతు ప్రేమికురాలు - ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త అయిన మేన‌క ఇప్పుడే కాకుండా ఇంత‌కుముందు కూడా మూగ జీవాల‌కు - ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూల‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇందుకు వివిధ అంత‌ర్జాతీయ సంస్థ‌ల నుంచి అవార్డులు కూడా అందుకున్నారు. గ‌తంలో కూడా ఆమె చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్పదమ‌య్యాయి. గ‌తంలో దేశంలో 68 శాతం ఆత్మ‌హ‌త్య‌ల‌కు పురుషులే కార‌ణ‌మ‌ని ఆమె పేర్కొన‌డంతో నెటిజ‌న్ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.

ఇందిరా గాంధీ చిన్న‌కుమారుడు సంజ‌య్ గాంధీ భార్య అయిన మేన‌క‌... సంజ‌య్ గాంధీ 1980 ఒక విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించాక రాజ‌కీయాల్లో అడుగుపెట్టారు. ప్ర‌స్తుతం ఉత్త‌ర ప్ర‌దేశ్‌ లోని ఫిలిబిత్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. మొద‌టి నుంచీ ఇందిరాగాంధీ పెద్ద కోడ‌లు సోనియా గాంధీతో ఈమెకు స‌న్నిహిత సంబంధాలు లేవు. మేన‌క కుమారుడు వ‌రుణ్‌గాంధీ కూడా ఉత్త‌ర ప్ర‌దేశ్ నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. కాగా 1992లో మేన‌క ఏర్పాటు చేసిన పీపుల్స్ యానిమ‌ల్ సంస్థ జంతు సంర‌క్ష‌ణ‌కు సంబంధించి దేశంలోనే అతిపెద్ద‌ది.