Begin typing your search above and press return to search.

బాబు మొద‌లెట్టిన ర‌చ్చ ఇంకా సాగుతోంది

By:  Tupaki Desk   |   6 Dec 2015 11:25 AM GMT
బాబు మొద‌లెట్టిన ర‌చ్చ ఇంకా సాగుతోంది
X
తెలుగుదేశం అధ్య‌క్షుడు - ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు గ‌తంలో రాజేసిన నిప్పు ఇంకా ర‌గులుతోంది. చంద్ర‌బాబు తీసుకున్న డైన‌మిక్ స్టెప్‌ తో ఈ అంశం మ‌రుగున ప‌డిపోయింద‌ని భావించిన‌ప్ప‌టికీ తాజాగా అదే వేడి ఉండ‌టం ఆస‌క్తిక‌రం. శ్రీ‌కాకుళం జిల్లా సోంపేట మండలంలోని బీల వద్ద నాగార్జున కన్‌ స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌ సీసీ) థర్మల్ ప‌వ‌ర్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతుల ఇస్తూ 2009లో దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి సీఎంగా జీవో 1109ను జారీచేశారు. దీన్ని నిర‌సిస్తూ అక్క‌డి స్థానికులు ఆందోళ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో కాల్పులు జ‌రిగి ప‌లువురు అసువులు బాశారు కూడా! అప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం త‌ర‌ఫున ఆ పార్టీ అద్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు పోరాటం షురూ చేశారు. వైఎస్ హ‌యాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వల్లే ఈ ప్లాంట్ వ‌స్తుంద‌ని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేపట్టారు. వైఎస్ త‌ర్వాతి ప్ర‌భుత్వాలు ఆ నిర్ణ‌యాన్ని పెండింగ్‌ లో పెట్ట‌డం త‌ర్వాత రాష్ర్ట విభ‌జ‌న‌, చంద్ర‌బాబు సీఎం కావ‌డం తెలిసిన విష‌యమే.

తెలుగుదేశం పార్టీ కీల‌క పాత్ర పోషిస్తూ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు వ‌ద్దంటూ దాదాపు ఆరేళ్లుగా స్థానికులు చేస్తున్న ఆందోళ‌నకు ఇటీవ‌ల ఫుల్‌ స్టాప్ ప‌డింది. అక్క‌డ ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు చంద్ర‌బాబు నేతృత్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మొత్తంగా థర్మల్ పవర్ ప్లాంట్‌ ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన వారి నిరీక్ష‌ణ ఫ‌లించినా దాని ప‌రిణామాలు ఇంకా ఘాటుగానే ఉన్నాయి.

తాజాగా సోంపేట మండలంలోని తీర ప్రాంత గ్రామాలలో పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును మత్స్యకారులు అడ్డుకున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అడ్డుకునే ఉద్యమంలో భాగంగా ఆనాడు పోలీసు కాల్పులకు ధర్మాన ప్రసాదరావే కారణం అని ఆరోపిస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఎర్రముక్కాం - నడుమూరు గ్రామాల్లో రహదారిపై వారు బైఠాయించి ధర్మాన, ఇతర వైసీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలకు క్షమాపణ చెప్పిన తరువాతే గ్రామాల్లో పర్యటించాలని వారు డిమాండ్ చేశారు.ఆరేళ్ల నాటి పోరాట స్పూర్తి ఇంకా వారిలో కొన‌సాగుతుందంటే...ఆ సామాన్య మత్స్యకారులు త‌మ నేల‌త‌ల్లిని ఎంత న‌మ్ముకొని ఉంటారో!