Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ముందుంది ముసళ్ల పండుగ

By:  Tupaki Desk   |   6 Feb 2018 6:07 PM GMT
చంద్రబాబుకు ముందుంది ముసళ్ల పండుగ
X
2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఉంటే మంచిదా.. విడిపోతే మంచిదా.. పవన్ జనసేనను కలుపుకొనిపోవాలా? లేదంటే చూసీచూడనట్లు వదిలేయాలా? అని టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ లెక్కలేసుకుంటున్న వేళ ఏపీలో రాజకీయాలను - ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ భవితను దెబ్బతీసేలా కీలక వర్గమొకటి ఆ పార్టీకి దూరమవుతోంది. తాజా పరిణామాలు చంద్రబాబును తెగ ఆందోళనకు గురిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కాపులకు రిజర్వేషన్ హామీ ఇచ్చి ఆ సమస్య నుంచి తాత్కాలికంగా బయటపడిన చంద్రబాబుకు మరో కొత్త కుల పోరు మొదలైంది. మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు కానీ తమను ఎస్టీల్లో చేర్చాలంటూ గత 50 రోజులుగా మత్స్యాకారులు ఆందోళన చేస్తున్నారు. వారిని ఎస్టీల్లో చేర్చితే తమకు తీరని నష్టం కలుగుతుందని ఇప్పటికే ఎస్టీ క్యాటగిరీలో ఉన్న ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళంలో జిల్లాలో ఆదివాసీలు భారీ కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్ ను ముట్టడించారు. అక్కడ 50 రోజులుగా ధర్నా చేస్తున్న మత్స్యకారులు శిబిరాన్ని తగలబెట్టడంతో హింస చెలరేగింది.

మరోవైపు రాష్ర్టవ్యాప్త మత్స్యకార సంఘాలు జనసేన అధినేత పవన్ ను కలిసి ఇదే విషయంలో ఆయన మద్దతు కోరాయి. ఆయన వారికి మద్దతు పలికి మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని డిమాండు చేస్తున్నారు. దీంతో ఈ విషయం క్రమంగా మరింత ముదురుతున్నట్లుగా తెలుస్తోంది.

రాజకీయంగా చూస్తే మత్స్యకారులు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీని భుజాన మోస్తున్నారు. కానీ... ఇప్పుడు చంద్రబాబు వారి సమస్యలను పట్టించుకోకపోతే, రిజర్వేషన్ కల్పించకపోతే ఓట్లేసేది లేదని హెచ్చరిస్తున్నారు. ఏపీలో సుమారు 60 లక్షల వరకు మత్స్యాకర జనాభా ఉంటుందని అంచనా. 9 జిల్లాల్లోని తీర ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ విస్తరించి ఉన్న మత్స్యకారుల ఓట్లుకానీ కోల్పోతే చంద్రబాబుకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.