Begin typing your search above and press return to search.

జ‌మిలి చేయ‌టం అంత ఈజీ కాద‌ట‌..ఐదు స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ట‌!

By:  Tupaki Desk   |   28 Jun 2019 4:55 AM GMT
జ‌మిలి చేయ‌టం అంత ఈజీ కాద‌ట‌..ఐదు స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ట‌!
X
మోడీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల్ని నిశితంగా ప‌రిశీలిస్తే.. జ‌మిలి ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంద‌ని చెప్పాలి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసి నెల కూడా కాక‌ముందే వ‌చ్చే ఎన్నిక‌ల గురించి క‌స‌ర‌త్తా? అంటే.. అవున‌ని చెప్పాలి. ఇప్పుడు కానీ మొద‌లు పెట్ట‌కుంటే జ‌మిలి ఎన్నిక‌ల‌కు ఈసారికి నిర్వ‌హించ‌టం సాధ్యం కాదు. దీర్ఘ‌కాలం ప‌వ‌ర్లో ఉండాల‌ని భావిస్తున్న మోడీ అందుకు త‌గ్గ‌ట్లుగా జ‌మిలికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా చెప్పాలి.

భావోద్వేగ రాజ‌కీయాల‌తో ఎన్నిక‌ల ఎజెండాను ఎలా డిసైడ్ చేయాలో మోడీషాల‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికి తెలీదు. ఈ నేప‌థ్యంలో జ‌మిలి ద్వారా గ‌రిష్ఠ ప్ర‌యోజ‌నాన్ని పొందే ప్ర‌య‌త్నంలో వారున్నారు. అయితే.. అనుకున్నంత తేలిగ్గా జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ సాధ్యం కాదు. ఇప్పుడున్న ఎన్నిక‌ల విధానాన్ని స‌మూలంగా మార్చేసే ఈ కొత్త విధానం అమ‌ల్లోకి రావాల‌న్నా.. అధికారికం కావాల‌న్నా రాజ్యాంగ స‌వ‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి. అదికూడా ఒక‌ట్రెండుసార్లుకాదు.. ఏకంగా ఐదు రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు చేస్తే కానీ జ‌మిలి వ్య‌వ‌హారం ప్రాక్టిక‌ల్ గా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ విష‌యాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏడాది క్రిత‌మే కేంద్ర న్యాయ‌మంత్రిత్వ శాఖ‌కు తెలియ‌జేసింది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల‌తో పాటు 1951నాటి ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు కూడా చేప‌ట్టాల‌ని పేర్కొంది. బిజినెస్ రూల్స్ ను స‌వ‌రించాల‌ని వెల్ల‌డించింది. జ‌మిలికి డిసైడ్ అయితే.. రాజ్యాంగానికి చేయాల్సిన ముఖ్య‌మైన ఐదు స‌వ‌ర‌ణ‌ల విష‌యానికి వ‌స్తే..

అందులో మొద‌టిది.. ఉభ‌య స‌భ‌ల ప‌ద‌వీకాల ప‌రిమితి కుదించ‌టానికి సంబంధించిన 83వ అధికార‌ణ స‌వ‌ర‌ణ (ఇప్పుడున్న ప‌ద్ద‌తిలో అసెంబ్లీలు కానీ.. లోక్ స‌భకు కాని ఐదేళ్ల ప‌ద‌వీకాలం ఉంటుంది. జ‌మిలి విధానంలో కొన్ని రాష్ట్రాల ప‌ద‌వీకాలాన్ని కుదించాల్సి వ‌స్తుంది. అదే స‌మ‌యంలో లోక్ స‌భ‌ను ర‌ద్దు చేసి గ‌డువుకు ముందే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రావాల్సి ఉంటుంది. అలా జ‌ర‌గాలంటే స‌వ‌ర‌ణ త‌ప్ప‌దు)

రెండోది.. లోక్ స‌భ‌ను రాష్ట్రప‌తి ర‌ద్దు చేసేందుకు వీలు క‌ల్పించే ఆర్టిక‌ల్ 85కు మార్పు (ఇప్పుడున్న విధానంలో సాధార‌ణ ప‌రిస్థితుల్లో ర‌ద్దు చేసే వీలుండ‌దు. జ‌మిలి నేప‌థ్యంలో గ‌డువు తీర‌క ముందే ర‌ద్దుచేయాల్సి ఉంటుంది. అంటే.. ఆ అధికారాన్ని రాష్ట్రప‌తికి క‌ట్ట‌బెట్టాలి. అందుకు స‌వ‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి)

మూడోది.. అసెంబ్లీల కాల ప‌రిమితిని త‌గ్గించేందుకు సంబంధించిన ఆర్టిక‌ల్ 172 (ఇప్పుడున్న దాని ప్ర‌కారం అసెంబ్లీ కాల ప‌రిమితి ఐదేళ్లు. దాన్ని కుదించాలి. అదే స‌మ‌యంలో కొన్ని రాష్ట్రాల్లో గ‌డువు ముగిసిన త‌ర్వాత కొద్దికాలం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కుండా ఆపాల్సి ఉంటుంది. ఇందుకు అవ‌స‌ర‌మైన చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌కు రాజ్యాంగ స‌వ‌ర‌ణ త‌ప్ప‌దు)

నాలుగో అంశం.. అసెంబ్లీల ర‌ద్దుకు సంబంధించిన ఆర్టిక‌ల్ 174.

ఐదో అంశం.. రాష్ట్రప‌తి పాల‌న విధించేందుకు సంబంధించిన ఆర్టిక‌ల్ 356. ఈ స‌వ‌ర‌ణ‌లు చేయ‌టంతోపాటు మ‌రికొన్ని మార్పులు కూడా జ‌మిలి కార‌ణంగా చ‌ట్టంలో చేయాల్సి ఉంటుంది. ఆయా అంశాల్ని చూస్తే..

+ ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 2లో ‘జమిలి ఎన్నికలు’ అన్న పదాన్ని చేర్చి నిర్వ‌చించాలి.

+ నో కాన్ఫిడెన్స్‌ మోషన్‌ అన్న పదాన్ని తీసేసి కన్‌ స్ట్రక్టివ్‌ వోట్‌ ఆఫ్‌ నో కాన్ఫిడెన్స్‌’ అన్న పదాన్ని చేర్చాలి. ఇందుకోసం లోక్‌ సభ బిజినెస్‌ (సభా నిర్వహణ) నిబంధన 198-ఎ ను సవరించాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమ‌లు చేసే అసెంబ్లీ నిబంధ‌న‌ల‌కు సంబంధించి ఇదే త‌ర‌హాలో స‌వ‌ర‌ణ త‌ప్ప‌దు.

+ లోక్ స‌భ కానీ అసెంబ్లీల‌లో కానీ ఏ పార్టీకి .. ఏ కూట‌మికి కాని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత బ‌లం రాని వేళ‌లో ప్ర‌తిష్ఠంభ‌న చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా రాజ్యాంగంలోని ప‌దో షెడ్యూల్ లోని పేరాగ్రాఫ్ 2(1)(బీ)ని ఎత్తివేయాలి. ఈ ర‌ద్దును ఒక ప్ర‌త్యేక చ‌ర్య‌గా చేప‌ట్టాల్సి ఉంటుంది.

+ రాజ్యాంగంలోని 83 - 172 అధికరణాలకు సవరణతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 14 - 15లను కూడా సవరించాలి. సాధారణంగా లోక్‌సభ గానీ - అసెంబ్లీ గానీ ఐదేళ్ల కాలపరిమితితో ఉంటుంది. రాజకీయ విభేదాల వల్ల మధ్యలోనే ప్ర‌భుత్వం ప‌డిపోతే ఆ ఏర్పడే కొత్త లోక్‌ సభ లేదా అసెంబ్లీ.. మిగిలి ఉన్న కాలపరిమి తి వరకే ఉండాలి తప్ప పూర్తి ఐదేళ్లూ ఉండే అవకాశం లేకుండా చేసేందుకు ఈ సవరణలు ఉపకరిస్తాయి.

+ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ పరిమితి సవరణ నిమిత్తం కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్లు 14 - 15లను సవరించాలి.

+ ఈ సవరణలను సగం రాష్ట్రాలు ఆమోదించాలి. తద్వారా దీనిపై ఎలాంటి న్యాయపరమైన సవాళ్లు, కేసులు రాకుండా ఉంటాయి. రాష్ట్రాలకు సంబంధించిన మార్పులను రాజ్యాంగంలోని 328 అధికరణం కింద నేరుగా పరిశీలించే అవకాశం ఉంటుంది.