Begin typing your search above and press return to search.

ఐదుగురు సీఎంలు.. ఒక మాజీ ప్రధాని.. కరోనా రికార్డు

By:  Tupaki Desk   |   20 April 2021 3:51 AM GMT
ఐదుగురు సీఎంలు.. ఒక మాజీ ప్రధాని.. కరోనా రికార్డు
X
కరోనా దూకుడు మామూలుగా లేదు. సామాన్యుల్ని వదలని ఈ మహమ్మారి.. సెకండ్ వేవ్ లో రాజకీయ నేతల్ని వదలటం లేదు. ఫస్ట్ వేవ్ లో సెలబ్రిటీల్ని వేధించిన వైరస్.. ఈసారి సీనియర్ రాజకీయ నేతల్ని పెద్ద ఎత్తున పట్టుకుంటోంది. తాజాగా చూస్తే.. దేశంలోని ఐదుగురు ముఖ్యమంత్రులు ఇప్పుడు కరోనాతో ఇబ్బంది పడుతూ.. చికిత్స పొందుతున్నారు. పెద్దగా బయటకు రాని మాజీ ప్రధాని మన్మోహన్ ను పట్టేసింది. దేశంలో వైరస్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందని చెప్పటానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తమిళనాడు సీఎం పళనిస్వామి.. కేరళ సీఎం పినరయి విజయన్.. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లు ఉన్నారు. విచిత్రంగా పాజిటివ్ గా చికిత్స పొందుతున్న ఐదుగురు ముఖ్యమంత్రుల్లో నలుగురు దక్షిణాదికి చెందిన వారే కావటం గమనార్హం. అంతేకాదు.. ఈ ఐదుగురు ముఖ్యమంత్రుల్లో ఒక్కరు తప్పించి.. మిగిలిన వారంతా ఎన్నికల ప్రచార సభలకు హాజరైన వారన్నది మరో కామన్ పాయింట్.

కరోనా బారిన పడిన ప్రముఖ రాజకీయ నేతలు.. వారి కుటుంబ సభ్యులు చాలామందే ఉన్నారు. తాజాగా పాజిటివ్ గా తేలిన వారిలో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారిలో.. మాజీ ప్రధాని మన్మోహన్ ఎయిమ్స్ లో ఉంటే.. మిగిలిన వారు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్ లోనే చికిత్స పొందుతున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు చెబుతున్నారు. జనరల్ ఫిజిషీయన్ గా ఆయనకు మంచి పేరుంది. ఎన్నో ఏళ్లుగా.. కేసీఆర్ కు వైద్యుడిగా వ్యవహరిస్తున్నారు. దేశంలో కరోనా తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని చెప్పటానికి.. రాజకీయ ప్రముఖుల ఉదంతాలే పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు.