Begin typing your search above and press return to search.

పార్టీలో చేరిన 5 రోజులకే రియల్ సింగానికి బీజేపీ కీలక బాధ్యతలు

By:  Tupaki Desk   |   30 Aug 2020 2:00 PM GMT
పార్టీలో చేరిన 5 రోజులకే రియల్ సింగానికి బీజేపీ కీలక బాధ్యతలు
X
సింగం సినిమాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ భాషలో తీసినా ఈ సినిమాకు లభించే ఆదరణ అంతా ఇంతా కాదు. రీల్ సింగానికి స్ఫూర్తి రియల్ సింగమే. నిజమే..కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి కుప్పుస్వామి అన్నామలై ని స్ఫూర్తిగా తీసుకొని సింగం సినిమాను తీశారు. 2011 బ్యాచ్ కు చెందిన ఈ యువ ఐపీఎస్ అధికారి విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించేవారు. తప్పులు చేసే వారికి చుక్కలు చూపించేవారు.

అందుకే ఆయన్నుకన్నడ వాసులు సింగం అన్నా అని వ్యవహరించేవారు. ఇతగాడి స్ఫూర్తితోనే సింగం మూవీని తీశారు. ఏడాది క్రితం తన పోలీసు ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసిన కుప్పుస్వామి సరిగ్గా.. ఏడాది తర్వాత బీజేపీలో చేరారు. గత మంగళవారం బీజేపీలో చేరిన ఆయన.. తన రాష్ట్రమైన తమిళనాడు పాలిటిక్స్ మీద ఫోకస్ చేయనున్నారు.

నీతికి.. నిజాయితీకి.. ధైర్యసాహసాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కుప్పుస్వామి మీద బీజేపీ చాలానే ఆశలు పెట్టుకున్న వైనం తాజాగా చోటు చేసుకున్న పరిణామాన్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు. పార్టీలో చేరిన ఐదు రోజులకే రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్ష పదవిని అప్పజెప్పేయటం చూస్తే.. ఆయన మీద చాలానే ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపించక మానదు. వచ్చే ఏడాది (2021)లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిన పాగా వేయాలని భావిస్తున్న కమలనాథులకు కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ పట్టుచిక్కటం లేదు.

తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార అన్నాడీఎంకే.. విపక్ష డీఎంకేలు బలహీనంగా ఉన్నాయి. ఇలాంటివేళలో.. కుప్పుస్వామి లాంటి అధికారిని రంగంలోకి దించి తమిళుల మనసుల్ని దోచాలన్నట్లుగా బీజేపీ అధినాయకత్వ ఆలోచనగా చెప్పొచ్చు. పార్టీకి ఉపయోగపడటమే కాదు.. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్న పట్టుదలతో మోడీ అండ్ కో ఉంది. మరి.. వీరి అంచనాల్ని రియల్ సింగం ఎంతమేర నెరవేరుస్తారో చూడాలి.