Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నం!..జ‌గ‌న్ కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు!

By:  Tupaki Desk   |   7 Jun 2019 6:30 AM GMT
సంచ‌ల‌నం!..జ‌గ‌న్ కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు!
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌నాల‌కే సంచ‌నాలుగా మారిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టిదాకా క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో పాల‌న‌ను సాగించేందుకు ఆయ‌న సిద్ధ‌మయ్యారు. నేటి ఉద‌యం పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయ‌న... త‌న కేబినెట్ లో ఎవ‌రెవ‌రు ఉంటార‌న్న విష‌యంపై క్లారిటీ ఇచ్చేసిన జ‌గ‌న్‌... ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా త‌న కేబినెట్ ను రూపొందించారు. కేబినెట్ లో ఏకంగా ఐదుగురు డిప్యూటీ ముఖ్య‌మంత్రులకు స్థానం క‌ల్పించిన జ‌గ‌న్‌... ఆ ఐదు ప‌ద‌వుల‌ను బ‌ల‌హీన వ‌ర్గాలుగా ఉన్న ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీ - కాపు సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన వారికి కేటాయించ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఈ ఒక్క దెబ్బ‌తో అస‌లు ఏ ఒక్క సామాజిక వ‌ర్గానికి కూడా త‌న కేబినెట్ లో ప్రాధాన్యం ద‌క్క‌లేద‌న్న విష‌యంపై విమ‌ర్శ‌లు రాకుండా చేశార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అస‌లు జ‌గ‌న్ కేబినెట్ లో డిప్యూటీ సీఎం అనే ప‌ద‌వి ఉంటుందా? అన్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగ‌గా... ఒక‌టి కాదు,. రెండు కాదు... ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం పోస్టుల‌ను కేటాయించిన జ‌గ‌న్ అంద‌రినీ ఆశ్య‌ర్యంలో ముంచెత్తారు. ఏ ఒక్క సామాజిక వ‌ర్గం కూడా త‌మ‌కు కేబినెట్ లో ప్రాధాన్యం దక్క‌లేద‌ని చెప్పేందుకు ఆస్కారం లేకుండా జ‌గ‌న్ చేశార‌ని చెప్పాలి. అంతేకాకుండా జ‌నాభాలో స‌గ‌భాగం ఉన్న రిజ‌ర్వ్‌ డ్ కేట‌గిరీల‌కు అదే దామాషా ప‌ద్ద‌తిన స‌గం మేర మంత్రి ప‌ద‌వుల‌ను కేటాయిస్తున్న‌ట్లుగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌న కేబినెట్ లో స‌గానికి స‌గం మంత్రి ప‌ద‌వులు రాష్ట్రంలోని బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కే ఇస్తున్న‌ట్టుగా జ‌గ‌న్ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపార‌నే చెప్పాలి.

అదే స‌మ‌యంలో చీటికి మాటికి త‌న కేబినెట్ లో మార్పులు ఉండబోవ‌ని - రెండున్నరేళ్ల దాకా అస‌లు త‌న కేబినెట్ లో మార్పులే ఉండ‌వ‌ని కూడా జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రెండున్నరేళ్ల త‌ర్వాత మంత్రుల ప‌నితీరును బేరీజు వేసి పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌ని కూడా ఆయ‌న చెప్పారు. కొత్త‌గా కేబినెట్ లోకి తీసుకునే వారికి రెండున్న‌రేళ్ల త‌ర్వాతే అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని కూడా జ‌గ‌న్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అప్ప‌టిదాకా మంత్రిప‌ద‌వుల కోసం య‌త్నాలు సాగించే అవ‌కాశాల‌కు కూడా జ‌గ‌న్ గండికొట్టేశారు. రేపు కేబినెట్ మంత్రులతో ప్ర‌మాణం చేయిస్తానని చెప్పిన జ‌గ‌న్‌... త‌న కేబినెట్ లో మొత్తం 25 మంది మంత్రులుంటార‌ని ప్ర‌క‌టించారు. ఈ 25 మంది మంత్రుల్లో ఐదుగురికి డిప్యూటీ సీఎం ప‌ద‌వులు కేటాయిస్తున్న‌ట్లు కూడా జ‌గ‌న్ చెప్పేశారు. ఇక మంత్రి ప‌ద‌వుల కేటాయింపులో ప‌ద‌వులు ద‌క్క‌ని వారిలో ఎలాంటి అసంతృప్తి లేకుండా... మంత్రులుగా ఎంపిక చేసిన వారిని ఎందుకు ఎంపిక చేశామ‌న్న విష‌యాన్ని కూడా జ‌గ‌న్ వివ‌రించిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చాలా పార‌ద‌ర్శ‌కంగా - పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించి. మంత్రుల జాబితాను శాస‌న‌సభా ప‌క్ష భేటీలో పెట్టి మ‌రీ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.