Begin typing your search above and press return to search.

ఏపీ సచివాలయంలో వైరస్ కలకలం ....తాజాగా మరో ఐదుగురికి ...!

By:  Tupaki Desk   |   6 Jun 2020 10:50 AM GMT
ఏపీ సచివాలయంలో వైరస్ కలకలం ....తాజాగా మరో ఐదుగురికి ...!
X
ఏపీ సచివాలయంలో వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో ఇప్పటి వరకు మొత్తంగా ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

తాజాగా, ఔట్‌సోర్సింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్‌ లో పనిచేసే ఓ ఉద్యోగికి, ప్రణాళిక విభాగం‌లో డ్రైవర్ ‌గా పనిచేస్తున్న వ్యక్తికి, పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగి, సీఎం బ్లాక్‌లో ఆర్‌ టీ జీఎ‌స్ ‌లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్ ‌కు, సీఎం పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌కు, ఉన్నత విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కు వైరస్ పాజిటివ్ గా తేలినట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. సచివాలయంలోని ఉద్యోగుల్లో 750 మందికి పరీక్షలు చేయగా, వారిలో ఐదుగురికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది అని, వారిలో రెవెన్యూ, ఆర్టీజీఎస్‌, మున్సిపల్ విభాగాల్లో పనిచేసే వారు ఉన్నారు అని, ఈ నేపథ్యంలో సచివాలయంలోని 1, 2వ బ్లాకుల్లో పనిచేసే ఉద్యోగులకు వైరస్ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది.

కాగా, మొదట హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో పలువురికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సచివాలయంలోని 3, 4 బ్లాకుల్లో పనిచేసే ఉద్యోగులు కార్యాలయాలకు రావొద్దని ఉద్యోగుల సంఘం సూచనలు చేసింది. మరోవైపు వైరస్ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను విధించింది. సచివాలయ ఉద్యోగులు కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ని వేసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

ఇకపోతే, ఏపీలో మొత్తం వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,588కు చేరింది. అందులో 2323 మంది కోలుకోగా, 73 మంది మరణించారు. ప్రస్తుతం 1192 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 741 మందికి వైరస్ నిర్ధారణ అవ్వగా.. వారిలో 467 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 131 మందికి వైరస్ పాజిటివ్‌ రాగా.. అందులో నలుగురు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4లక్షలకు పైన పరీక్షలు నిర్వహించారు.