Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు ఐదుగురు ఎమ్మెల్యేల ఝ‌ల‌క్‌?

By:  Tupaki Desk   |   7 March 2019 7:28 AM GMT
కాంగ్రెస్ కు ఐదుగురు ఎమ్మెల్యేల ఝ‌ల‌క్‌?
X
క‌ర్ణాట‌కలో సీఎం హెచ్‌.డి.కుమార‌స్వామి నేతృత్వంలోని సంకీర్ణ‌ ప్ర‌భుత్వానికి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ ఝ‌ల‌క్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేయ‌డం ద్వారా అసెంబ్లీలో ప్ర‌భుత్వ బ‌లాన్ని వారు డోలాయ‌మానంలోకి నెట్టేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 1-2 రోజుల్లో వారు త‌మ రాజీనామాల‌ను ప్ర‌క‌టించనున్న‌ట్లు స‌మాచారం.

గ‌తేడాది జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 104 సీట్లు గెల్చుకోవ‌డం ద్వారా బీజేపీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. అయితే - ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మెజారిటీని ద‌క్కించుకోవ‌డంలో విఫ‌లమైంది. దీంతో కాంగ్రెస్‌(78)-జేడీఎస్(37) సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అప్ప‌టి నుంచి కాంగ్రెస్‌ - జేడీఎస్ మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో రాష్ట్రంలో రాజ‌కీయ అస్థిర‌త కొన‌సాగుతోంది.

మ‌రోవైపు - లోక్ స‌భ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో క‌లిసిక‌ట్టుగా బ‌రిలో దిగే విష‌యంపై కాంగ్రెస్‌-జేడీఎస్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. పొత్తులో భాగంగా త‌మ‌కు క‌నీసం 10 లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు కేటాయించాల‌ని జేడీఎస్ అధినేత - మాజీ ప్ర‌ధాన‌మంత్రి హెచ్‌.డి.దేవెగౌడ తాజాగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి విన్న‌వించారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

గోక‌క్ ఎమ్మెల్యే ర‌మేశ్ జ‌ర్ఖిహొలి - బ‌ళ్లారీ రూర‌ల్ శాస‌న‌స‌భ్యుడు బి.నాగేంద్ర‌ - అథ‌ని ఎమ్మెల్యే మ‌హేశ్ కుమ‌ట‌ల్లి - కంపిలి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జి.ఎన్‌.గ‌ణేశ్‌ - మ‌స్కి శాస‌న‌స‌భ్యుడు ప్ర‌తాప్ గౌడ పాటిల్ కాంగ్రెస్ కు రాజీనామా చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. వీరంతా కాంగ్రెస్ లో మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య నాయ‌క‌త్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ట‌.

బీజేపీలో చేర‌కుండా నిలువ‌రించేందుకుగాను వారి రాజీనామాల‌ను ఆమోదించ‌కూడ‌ద‌ని కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. అయితే - త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వి పోయినా స‌రే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరాల్సిందేన‌ని ఆ ఐదుగురు భావిస్తున్నార‌ని.. అందుకే ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా వారు రాజీనామా చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే గ‌త సోమ‌వారం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేశ్ జాద‌వ్ త‌న శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన నేప‌థ్యంలో ఈ ఐదుగురు కూడా స‌భ‌ను వీడితే కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి చిక్కులు త‌ప్ప‌వు. మ‌రింత‌మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను ఆక‌ర్షించ‌డం ద్వారా బీజేపీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.