Begin typing your search above and press return to search.

ట్యాంక్ బండ్:ఒకేసారి అయిదుగురు ఆత్మ‌హ‌త్యా య‌త్నం

By:  Tupaki Desk   |   29 April 2017 8:16 AM GMT
ట్యాంక్ బండ్:ఒకేసారి అయిదుగురు ఆత్మ‌హ‌త్యా య‌త్నం
X
హైద‌రాబాద్ లోని ట్యాంక్ బండ్ ఒక‌ప్పుడు పెద్ద సూసైడ్ స్పాట్‌. కానీ, కొద్దికాలంగా అక్క‌డ ప‌రిస్థితి మారింది. కానీ, తాజాగా అయిదుగురు వ్య‌క్తులు ట్యాంక్ బండ్ పై నుంచి హుస్సేన్‌ సాగర్ లో దూకడానికి ప్రయత్నించడం క‌ల‌క‌లం రేపింది. అయితే సకాలంలో పోలీసులు వారిని గుర్తించడంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. ఆ ఐదుగురిని ఆత్మహత్య చేసుకోనివ్వకుండా అడ్డుపడ్డ పోలీసులు.. అనంతరం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ త‌రువాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారిని ఇంటికి పంపించారు.

ప్రాణాలు తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన వారంతా న‌గ‌రానికి చెందిన‌వారే. భర్తల వేధింపులు తాళలేక కొందరు - తాగుడుకి బానిసై ఒకరు - మానసిక స్థితి సరిగా లేక ఇంకొకరు.. ఇలా కారణమేదైనా.. వీరంతా చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకుని ఇంత‌కు తెగించారు. వీరిలో పార్శీగుట్టకు చెందిన బి.సతీష్‌ (26) గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికెళ్లాడు. ఇంట్లో తల్లి సహా సోదరుడు అతన్ని గట్టిగా మందలించారు. ఇలాగే తాగితే భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. వారి మాటలకు నొచ్చుకున్న సతీష్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఆ ప్రాంతానికి వచ్చాడు. అబిడ్స్ లోని చిరాగ్ లైన్ ప్రాంతానికి చెందిన హపీజ్ (24) అనే యువకుడు చాలాకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇంటి నుంచి పారిపోయి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని యత్నిస్తున్న సమయంలో పోలీసులకు చిక్కాడు. హబ్సిగూడకు చెందిన ఊర్మిళ(43) అనే మహిళ భర్తతో విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి ఉంటోంది. గురువారం రాత్రి దగ్గరి బంధువు ఒకరితో గొడవ చోటు చేసుకోవడంతో... తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుని ఆత్మహత్యకు యత్నించబోయింది. తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకు చెందిన ఎం.కె.సంధ్య (36) భర్త ప్రవర్తనతో విసిగిపోయింది. మరో మహిళతో అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటం.. సంధ్యను పూర్తిగా పట్టించుకోకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. గురువారం రాత్రి తీవ్ర ఆవేదనతో ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుని ఆత్మహత్యకు యత్నించింది. కుషాయిగూడకు చెందిన బి.షైనే(21) నిత్యం భర్త తాగుడును భరించలేకఆత్మహత్యే మేలని హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది.

వీరంతా దాదాపు ఒకేసారి ఆత్మహత్యకు యత్నించడంతో.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న బ్లూకోట్స్ కానిస్టేబుల్స్ ఎన్.శ్రీనివాస్ - సి.సాయికిరణ్ - ఫజల్ అహ్మద్ ఖాన్ - బి.నీర్జూ - ఇస్మాయిల్ బిన్ సలామ్ - హోంగార్డు పి.వెంకట్రావు - డి.రవి జీవన్ వీరిని గుర్తించారు. తక్షణం స్పందించి వారిచేత ఆ ప్రయత్నం విరమింపజేశారు. దీంతో అయిదుగురి ప్రాణాలు నిలిచాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/