Begin typing your search above and press return to search.

జగన్:అపజయానికి ఐదు మెట్లు-1(అత్యాశ)

By:  Tupaki Desk   |   25 Sep 2015 5:58 PM GMT
జగన్:అపజయానికి ఐదు మెట్లు-1(అత్యాశ)
X
విజయం సాధించాలంటే ఎన్నో మెట్లెక్కాల్సి ఉంటుంది... అపజయానికి అంత కష్టపడనవసరం లేదు... ఒక్క మెట్టు దిగితే చాలు... ఢామ్మని పడిపోతాం ఒక్కోసారి. ఆ దెబ్బకు కాలు బెణకొచ్చు, నడుం విరగొచ్చు... దీర్ఘకాలంలో బెడ్ రెస్ట్ తప్పనిసరైపోవచ్చు. రాజకీయాల్లోనూ అంతే... స్టెప్ తేడాగానే పడితే, కెరీర్ కే ఎసరొస్తుంది. అందుకే చూసుకుని నడవాలి.. కొందరు నేతలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.. జగన్ లాంటివారు మాత్రం ఇంకా తప్పటడుగులే వేస్తున్నారు. దీంతో సునాయాసంగా విజయాలు సాధించాల్సిన పరిస్థితుల్లోనూ నిత్యం పరాజయాలతో పడుతూలేస్తున్నారు. అత్యాశ - అహంకారం - అనుభవ శూన్యత - అతి విశ్వాసం - అలక్ష్యం అనే అయిదు ప్రధాణ లక్షణాలతో అపజయాలవైపే అడుగులు వేస్తున్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో జగన్ తన బద్ధ శత్రువు రామోజీరావును కలవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దాని వెనుక కారణాలైమైనా కావొచ్చు కానీ... జగన్ మాత్రం మళ్లీ రాంగ్ స్టెప్ వేశారని ప్రజలు భావిస్తున్నారు.

ఆరేళ్ల కిందట ఇదే సెప్టెంబరు నెలలో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయిలో ఇష్టపడిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిచెందారు. ఆ తరువాత రాష్ట్రంలో రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. ఈ ఆరేళ్ల కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు రావడంతో పాటు రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహనరెడ్డి రాజకీయ జీవితంలోనూ ఊహించని మార్పులొచ్చాయి. రాజశేఖరరెడ్డి మరణంతో రాజకీయంగా జీవం పోసుకున్న జగన్ తన మితిమీరిన దూకుడు కారణంగా కష్టం సునాయాసంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని పోగొట్టుకోవడంతో పాటు ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం, ఇతర అవసరాలకోసం బద్ధ శత్రువుల గుమ్మాలనూ తొక్కాల్సివస్తోంది. రామోజీరావును జగన్ కలవడంలో ఇద్దరికీ ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ రాజకీయంగా మాత్రం జగన్ కు ఎప్పటికైనా అది నష్టదాయకమే... వైఎస్ తో ఆయన్ను పోల్చుకుంటున్న ప్రజలకు జగన్ తప్పుడు సంకేతాలు పంపారు. వైఎస్ కొడుకుగా ఇప్పటి మంచి జనాదరణ ఉన్న జగన్ వైఎస్ కు భిన్నంగా సాగుతున్నారు. ఎంతటివారినైనా ఢీకొనడం... ఎవరి కాళ్ల వద్దకూ వెళ్లకపోవడం వంటి లక్షణాలున్న వైఎస్ రాజశేఖరరెడ్డి లాగే జగన్ కూడా తొలినాళ్లలో కనిపించారు. రామోజీ, చంద్రబాబు వంటివారిని ఢీకొట్టడమే కాకుండా సోనియాగాంధీని కూడా లెక్కచేయకపోవడంతో జగన్ ను అంతా వైఎస్ తో సమానుడిగా భావించారు. కానీ... మొన్నటి ఎన్నికల తరువాత పరిణామాలను చూస్తుంటే పాత జగన్ ఏమయ్యాడు.. ఆయన దారి తప్పుతున్నాడా... ఎవరైనా దారి తప్పిస్తున్నారా... తెలివిగా వెళ్తున్నాడా... తెలిసే చేస్తున్నాడా... గతి తప్పాడా... మతి తప్పాడా..? రాజకీయ జీవితం కంటే వ్యాపార జీవితాన్నే జగన్ ఆశిస్తున్నాడా... లేదంటే భయపడుతున్నాడా..? వంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి.

వైఎస్ మరణానికి ముందే జగన్ ఎంపీగా ఉన్నప్పటికీ వైఎస్ మరణంతోనే ఆయన రాజకీయ జీవితం మొదలైందని చెప్పాలి. అయితే... అప్పటికి జగన్ లో దూకుడు తప్ప ఇంకేమీ కనిపించలేదు. తండ్రి చనిపోయాడు కాబట్టి ముఖ్యమంత్రి కుర్చీ నాదేననుకున్నాడు... అందుకు పార్టీ నేతలు కూడా కొందరు మనస్ఫూర్తిగా, కొందరు మొహమాటానికి అంగీకరిస్తూ సంతకాలు పెట్టి అధిష్ఠానానికి పంపించారు... అయితే... అధిష్ఠానం అనుభవాన్ని కోరుకుంది... జగన్ పట్ల వ్యతిరేకత లేకపోయినా ఆయనకు ఇంకా టైముందన్న ఉద్దేశంలో ఉండేది. ఫలితంగా జగన్ కు సీఎం కుర్చీ దొరకలేదు... దాంతో జగన్ రగిలిపోయాడు... కాంగ్రెస్ తో కుస్తీకి దిగాడు... దీంతో మొదట్లో సాఫ్టు కార్నర్ చూపించినా ఆ తరువాత సోనియా జగన్ పట్ల సీరియస్సయింది. ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు ఇంకా ఇబ్బందన్న ఉద్దేశంతోనే జగన్ ను తొక్కేయాలనే నిర్ణయించారు. దాంతో కాంగ్రెస్ లో ఇక కష్టమన్న ఉద్దేశంతో జగన్ వైసీపీ పార్టీ పెట్టుకున్నారు. కానీ... జగన్ కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలంగా ఉంటే ఇమీడియట్ గా కాకున్నా కాంగ్రెస్ అధికారంలోకొచ్చే ఒకట్రెండు టెర్ముల్లోనే ఆయనకు అవకాశం దొరికేది. కానీ.. జగన్ కాంగ్రెస్ తో అమీతుమీకే సిద్ధపడ్డారు. కాంగ్రెస్ తో ఉన్న అన్ని అవకాశాలనూ దాదాపుగా క్లోజ్ చేసుకున్నారు. కాంగ్రెస్ తో సఖ్యంగా ఉంటే జగన్ కు తన తండ్రి సీఎం కావడానికి పట్టిన సమయం కంటే చాలా తక్కువ సమయంలోనే పదవి వచ్చేది. రాజశేఖరరెడ్డి 30 ఏళ్లు కాంగ్రెస్ లో ఉన్నాక కానీ సీఎం కాలేకపోయారు. కానీ, జగన్ సోనియా, రాహుల్ లకు అనుకూలంగా ఉంటే ఒకట్రెండు టెర్ముల్లో అయ్యేవాడు.

దీంతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకోవడం నుంచి నిలదొక్కుకోవడం, ఎన్నికలను ఎదుర్కోవడం వరకు పడుతూలేస్తూ సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన అతి విశ్వాసం, అనుభవ శూన్యత, అహంకారం, అత్యాశ, అలక్ష్యం వంటి అయిదు ప్రధాణ లక్షణాలతో నష్టపోతున్నారు. సానుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అంతేకాదు... ఒకప్పుడు రాజకీయంగా బాహుబలిలా కనిపించిన జగన్ తాజా పరిణామాలతో బక్కపీనుగులా అనిపిస్తున్నారు.

-గరుడ

Disclaimer: Views expressed in this article are of the writer and do not represent the views of tupaki.com, and not necessarily reflect the opinions of the organisation either.