Begin typing your search above and press return to search.

ఐదు రాష్ర్టాల ఎగ్జిట్ పోల్స్ ఇవే

By:  Tupaki Desk   |   9 March 2017 1:21 PM GMT
ఐదు రాష్ర్టాల ఎగ్జిట్ పోల్స్ ఇవే
X
హోరాహోరీగా సాగిన‌ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి. ఒక్క పంజాబ్ త‌ప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ హ‌వా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ ఎగ్జిట్‌ పోల్ ఫలితాలు చూస్తే నోట్ల ర‌ద్దు.. బీజేపీపై ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం చూప‌న‌ట్లు తెలుస్తోంది. దేశ‌మంతా ఆస‌క్తి చూస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఈసారి బీజేపీ పాగా వేయ‌నున్న‌ట్లు ఎగ్జిట్‌ పోల్స్ చెబుతున్నాయి. ఇక్క‌డ బీజేపీ 185 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిల‌వ‌బోతున్న‌ద‌ని న్యూఎస్ ఎక్స్‌-ఎమ్మార్సీ స‌ర్వే అంచనా వేసింది. యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూట‌మికి 120 - బీఎస్పీకి 90 - ఇత‌రుల‌కు 8 సీట్లు వ‌స్తాయ‌న్న‌ది అంచ‌నా. టైమ్స్ నౌ ఎగ్జిల్ పోల్ మాత్రం యూపీలో బీజేపీకి 190 నుంచి 210 సీట్లు వ‌స్తాయ‌ని చెప్ప‌డం విశేషం. యూపీలో మ్యాజిక్ ఫిగ‌క్ 202. యూపీలో బీజేపీకి 34 శాతం ఓట్లు రానున్న‌ట్లు ఎగ్జిట్‌ పోల్స్ అంచ‌నా వేశాయి.

ఇక ఈ ఐదు రాష్ట్రాల్లో రెండో ముఖ్య‌మైన రాష్ట్రం పంజాబ్‌. ఇంత‌కుముందు అకాలీద‌ళ్‌, బీజేపీ కూట‌మి పాలిస్తున్న ఈ రాష్ట్రం ఈసారి కాంగ్రెస్ వ‌శం కానుంది. న్యూస్ఎక్స్‌-ఎమ్మార్సీ స‌ర్వే ప్ర‌కారం ఇక్క‌డ కాంగ్రెస్‌, ఆమ్ఆద్మీ పార్టీలకు చెరో 55 సీట్లు.. బీజేపీ, అకాలీద‌ళ్ కూట‌మికి కేవ‌లం ఏడు సీట్లు రానున్న‌ట్లు అంచ‌నా వేసింది. 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగ‌ర్ 58. అయితే ఇండియా టుడే స‌ర్వే మాత్రం 62 సీట్ల‌తో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు అంచనా వేసింది.

ఉత్త‌రాఖండ్‌లో బీజేపీ పాగా వేయ‌నున్న‌ట్లు ఎగ్జిట్‌పోల్స్ స్ప‌ష్టంచేస్తున్నాయి. న్యూస్‌24-చాణ‌క్య స‌ర్వే ప్ర‌కారం 70 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీకి 53, కాంగ్రెస్‌కు 15, ఇత‌రుల‌కు 2 సీట్లు రానున్నాయి. సీ ఓట‌ర్ మాత్రం పూర్తి భిన్న‌మైన ఫ‌లితాల‌ను అంచనా వేస్తున్న‌ది. ఇక్క‌డ బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు చెరో 32 సీట్లు వ‌స్తాయ‌ని సీ ఓట‌ర్ స‌ర్వే తేల్చింది.

ఇక గోవాలో మ‌రోసారి బీజేపీకి ఆధిక్యం ద‌క్క‌నుంది. ఇండియా టీవీ, సీ ఓట‌ర్ స‌ర్వే ప్ర‌కారం గోవాలో బీజేపీ 15 నుంచి 21 సీట్లు సాధించనుంది. కాంగ్రెస్ 12 నుంచి 18, ఆమ్ఆద్మీకి 4 సీట్లు రానున్న‌ట్లు అంచ‌నా వేసింది. గోవాలో మొత్తం సీట్లు 40 కాగా.. మ్యాజిక్ ఫిగ‌ర్ 21.

అటు మ‌ణిపూర్‌లోనూ బీజేపీకి మెజార్టీ రానున్న‌ట్లు ఎగ్జిట్‌ పోల్స్ అంచ‌నా వేశాయి. 15 ఏళ్లుగా ఈ రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది. మ‌ణిపూర్‌లో బీజేపీకి 25-31 సీట్లు, కాంగ్రెస్‌ కు 17-23 సీట్లు, ఇత‌రుల‌కు 9-15 సీట్లు వ‌స్తాయ‌ని ఇండియాటీవీ-సీఓట‌ర్ స‌ర్వే అంచ‌నా వేసింది. మణిపూర్ లో మొత్తం స్థానాలు 60 కాగా.. మ్యాజిక్ ఫిగర్ 31. ఒకవేళ అంచనాలు నిజమైతే 2012 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీకి ఇది భారీ విజయమే అవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/