Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల యూట‌ర్న్..లోక్ స‌భ‌లో ఇదే హాట్ టాపిక్!

By:  Tupaki Desk   |   20 Jun 2019 8:06 AM GMT
త‌మ్ముళ్ల యూట‌ర్న్..లోక్ స‌భ‌లో ఇదే హాట్ టాపిక్!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీపై ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరును మ‌ర్చిపోలేం. దేశంలో మ‌రే రాజ‌కీయ‌పార్టీ అధినేత ఇంత తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది లేదు. పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు చేసి మోడీ పరివారం దృష్టిలో బాగా ఫోక‌స్ అయ్యారు. ఎన్నిక‌ల్లో బాబు అనుకున్న‌ట్లుగా ఫ‌లితం రాకుంటే.. ఆయ‌న‌కు ఇత్త‌డే అన్న భావ‌న సామాన్య ప్ర‌జ‌లు మాట్లాడుకునేంత‌గా మోడీపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు చంద్ర‌బాబు.

డామిట్.. క‌థ అడ్డం తిరిగింద‌న్న చందంగా బాబు అనుకున్న దానికి పూర్తి భిన్న‌మైన ఫ‌లితం ఎన్నిక‌ల్లో రావ‌టంతో ఆయ‌న నోట మాట రాని ప‌రిస్థితి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో దారుణ‌మైన ప‌రాజ‌యాన్ని సొంతం చేసుకున్న ఆయ‌న‌.. మోడీ వ్య‌తిరేక‌త తీరును త‌గ్గించుకున్నారా? అన్న భావ‌న క‌లిగేలా తాజాగా వ్య‌వ‌హ‌రించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

లోక్ స‌భ‌లో బీజేపీ ఏక‌గ్రీవంగా ఎంపిక చేసిన స్పీక‌ర్ ఓం బిర్లాకు త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా తెలుగుదేశం ప్ర‌క‌టించింది. బీజేపీ నిర్ణ‌యాల్నిత‌ప్పు ప‌ట్టేందుకు భిన్నంగా స్పీక‌ర్ నియ‌మ‌కానికి తాము నూటికి నూరు శాతం మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. టీడీపీ ఎంపీల నిర్ణ‌యం కాసింత ఆస‌క్తిక‌రంగానూ.. ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. బీజేపీ స‌భ్యులు ప్ర‌తిపాదించిన స్పీక‌ర్ కు టీడీపీ ఎంపీలు ఓకే చెప్ప‌టం చూస్తుంటే.. మోడీతో సున్నం పెట్టుకోవ‌టానికి తాను అంత సిద్ధంగా లేన‌న్న సంకేతాల్ని బాబు పంపారా? అన్న‌దిప్పుడు కొత్త చ‌ర్చ‌గా మారింది.

తానిప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో మోడీతో ట‌ర్మ్స్ స‌రిగా లేకుంటే ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌న్న ఉద్దేశంతో.. అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న బాబు.. తాజా స్పీక‌ర్ ఎన్నిక విష‌యంలో తానే ఒక అడుగు ముందుకేసి.. బీజేపీ ఎంపిక‌ను త‌న ఎంపీల చేత ఓకే చెప్పించ‌టం ద్వారా యూట‌ర్న్ తీసుకోవ‌ట‌మే కాదు.. సంధికి తానే అడుగు ముందుకు వేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బీజేపీ తీసుకునే మంచి నిర్ణ‌యాల‌కు.. మోడీ ప్ర‌భుత్వం తీసుకునే చ‌క్క‌ల నిర్ణ‌యాల‌కు త‌మ మ‌ద్ద‌తు పూర్తిగా ఉంటుందని టీడీపీ ఎంపీలు ప‌లువురు పేర్కొన‌టం గ‌మ‌నార్హం. చూస్తుంటే మోడీతో ప్యాచ‌ప్ కు బాబు రెఢీగా ఉన్న‌ట్లు అనిపించ‌ట్లేదు?