Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని తొలగించిన బెజవాడ కార్పొరేషన్!

By:  Tupaki Desk   |   27 Feb 2022 3:12 AM GMT
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని తొలగించిన బెజవాడ కార్పొరేషన్!
X
నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా అన్న చందంగా సాగుతోంది ఏపీలోని జగన్ సర్కార్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య లొల్లి. ఒకరికి ఒకరు తమకు తోచిన రీతిలో షాకులిచ్చుకుంటున్నారు. ఎవరేం అనుకున్నా.. తాను అనుకున్నదే తప్పించి మరేదీ చేసేందుకు మనసొప్పని సీఎం జగన్.. పవన్ కల్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయక్ మూవీ విడుదల వేళ.. టికెట్లపై తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండటం తెలిసిందే.

నిజానికి టికెట్ల ధరలకు సంబంధించి పెద్ద ఎత్తున సమావేశాలు.. చర్చలతో పాటు సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తారని చెప్పినట్లుగా వార్తలు వచ్చినా.. అందరూ అంచనా వేసినట్లే.. పవన్ కల్యాణ్ తాజా మూవీ బీమ్లానాయక్ మూవీ విడుదల వేళ.. కారుచౌకగా ఉన్న టికెట్ల ధరల్ని పెంచే విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదంటూ జగన్ సర్కారుపై మండిపాటు వ్యక్తమవుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ ప్రభుత్వానికి భిన్నంగా తెలంగాణ అధికారపక్షంతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో భీమ్లానాయక్ మూవీకి ఐదు షోలు వేసుకునేందుకు అనుమతిని ఇవ్వటం తెలిసిందే. విచిత్రమైన విషయం ఏమంటే.. కేసీఆర్ ప్రభుత్వం ఐదు షోలకు అనుమతి ఇస్తే.. రిలీజ్ రోజున తెల్లవారుజామున నాలుగు గంటల వేళ ఫ్యాన్స్ షో వేసిన తీరు పవన్ అభిమానులకు పండుగగా మారింది. ఇలా.. పవన్ సినిమాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన కేసీఆర్ సర్కారు మీద పవన్ ఫ్యాన్స్ ఫుల్ పాజిటివ్ గా ఉండటం తెలిసిందే.

తమను ఏదోలా దెబ్బేస్తున్న జగన్ సర్కారుకు షాకిచ్చేందుకు వీలుగా.. పవన్ ప్యాన్స్ ఏపీలో ఎక్కడికక్కడ అనూహ్య కార్య్రమాల్ని చేపట్టటం తెలిసిందే. కారుచౌక అన్న మాటకు నిలువెత్తు రూపంగా ఉన్న ఏపీలోని సినిమా టికెట్ ధరలకు షాకిచ్చేలా.. కొన్ని థియేటర్ల దగ్గర చందాలు ఇవ్వటం తెలిసిందే. అంతేనా.. సినిమా విడుదల వేళ.. విజయవాడలోని భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. మంత్రులు కేటీఆర్.. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోటోలను.. మరోవైపు దివంగత వంగవీటి మోహన్ రంగా ఫోటోను అచ్చేసిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిపై ఏపీ అధికారపక్షం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.

ఏపీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా.. ఏపీకి సీఎం కేసీఆర్ అన్నట్లుగా ఫ్లెక్సీని ఏర్పాటు చేయటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తం కావటంతో పాటు.. ఏపీ సర్కారుకు సరైన రీతిలో సమాధానం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.

మీడియాలోనూ ఈ ఫ్లెక్సీ మీద పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో.. ఏపీ ప్రభుత్వంలోనూ ఇదే అంశంపై చర్య జరిగేలా చేసింది. కేసీఆర్ ఫ్లెక్సీతో ఒళ్లు మండేలా చేస్తున్న జగన్ వర్గీయులకు తమ సత్తాను చూపే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా ఉంటున్న సమీకరణాలకు తగ్గట్లే.. ఫ్లెక్సీ ఏర్పాటు జరిగిందని చెప్పినా.. అదంతా తమ వాళ్లను ప్రొవోక్ కలిగేలా చేశాయని జగన్ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే.. విడుదల వేళ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేశారు.

అభిమానంతో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే.. దాన్ని తొలగించే వరకు జగన్ సర్కారు నిద్ర పోలేదన్న మండిపాటు పవన్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. కసేఆర్ ఫ్లెక్సీని తొలగించిన బెజవాడ కార్పొరేషన్ అధికారుల తీరుపైనా వారు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఇప్పటికే పలు విధాలుగా తమను ఇబ్బంది పెడుతున్న జగన్ ప్రభుత్వంపై సరైన సమయంలో సరైన రీతిలో సమాధానం చెబుతామన్న ఆగ్రహాన్ని వారు ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర సీఎం ఫ్లెక్సీని తొలగింపు వైనం రానున్న రోజుల్లో ఆసక్తికర రాజకీయ పరిణామానికి తెర తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.