Begin typing your search above and press return to search.

ఆ టీఆర్ఎస్‌ నేత‌కు పొగ‌బెడుతున్నారా..?

By:  Tupaki Desk   |   16 Dec 2021 2:30 PM GMT
ఆ టీఆర్ఎస్‌ నేత‌కు పొగ‌బెడుతున్నారా..?
X
ఖ‌మ్మం టీఆర్ఎస్‌లో వ‌ర్గ విభేదాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌రుగుతున్న ప‌రిణామాలు అందుకు దారితీస్తున్నాయి. ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డిని కావాల‌నే సైడ్ చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం చోటుచేసుకున్న మ‌రొక సంఘ‌ట‌న ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. పొంగులేటి అభిమానులు ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని స‌మాచారం.

టీఆర్ఎస్ లో తాజాగా మ‌రోసారి వ‌ర్గ విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. స‌త్తుప‌ల్లి కేంద్రంగా ఫ్లెక్సీ వివాదం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఫ్లెక్సీని మంగ‌ళ‌వారం స‌త్తుప‌ల్లి రింగ్ సెంట‌ర్‌లో అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే ఒక‌రోజు వ్య‌వ‌ధిలోనే మునిసిపాలిటీ సిబ్బంది ఆ ఫ్లెక్సీని తొల‌గించారు. ఎన్నిక‌ల కోడ్ ఉందంటూ తొల‌గించార‌ని పొంగులేటి అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

అయితే.. ఎమ్మెల్యే ఫొటోను వ‌దిలేసి కేవ‌లం ఎంపీ ఉన్న ఫ్లెక్సీనే తొల‌గించార‌ని అభిమానులు ఆరోపిస్తున్నారు. తొల‌గించిన ఫ్లెక్సీలో పొంగులేటితో పాటు.. కేసీఆర్‌, కేటీఆర్‌, డీసీసీబీ మాజీ చైర్మ‌న్ మువ్వా విజ‌య‌బాబు, టీఆర్ఎస్ జిల్లా నాయ‌కులు డాక్ట‌ర్ మ‌ట్టా ద‌యానంద్ ఫొటోలు ఉన్నాయ‌ట‌.

దీంతో అధికార పార్టీలో మ‌రోసారి గ్రూపుల గొడవలు బ‌య‌ట‌ప‌డ్డాయి. గ‌తంలో కూడా ఇదే విధంగా ఫ్లెక్సీ ర‌గ‌డ చోటుచేసుకుంద‌ని.. ఫ్లెక్సీల‌ను చించ‌డం.. తొల‌గించ‌డం లాంటివి చేశార‌ని.. ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కావ‌డం త‌మ నేత‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని పొంగులేటి వ‌ర్గీయులు భావిస్తున్నారు.

పొంగులేటిని కావాల‌నే ప‌క్క‌న పెడుతున్నార‌నే అభిప్రాయాన్ని అభిమానులు వినిపిస్తున్నారు. పార్టీకి న‌మ్మ‌క‌స్తులుగా ప‌ని చేస్తున్నా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని.. కొత్త‌గా వ‌చ్చిన నేత‌ల‌నే అంద‌లం ఎక్కిస్తున్నార‌ని.. వారు త‌మ‌ను క‌లుపుకొని పోవ‌డం లేద‌ని పొంగులేటి వ‌ర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇవ‌న్నీ పొమ్మ‌న‌కుండా పొగ‌బెట్టే కార్య‌క్ర‌మాలేన‌ని.. ఇక‌పై కూడా ఇలాంటివి కొన‌సాగితే వేరే దారులు వెతుక్కోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

అయితే.. టీఆర్ఎస్ లోని మ‌రో వ‌ర్గం వాద‌న ఇంకోలా ఉంది. పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి త‌మ‌కు ఎప్పుడూ స‌హ‌క‌రించ‌డం లేద‌ని.. త‌న సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నార‌ని.. స‌మ‌ష్టి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం లేద‌ని వారు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూడా స‌హ‌క‌రించ‌లేద‌ని.. ప్ర‌త్య‌ర్థి పార్టీకి ప‌రోక్ష స‌హ‌కారం అందించార‌ని చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థికి ఉన్న ఓట్ల కంటే ఎక్కువ రావ‌డంలో ఇంటి దొంగ‌ల హ‌స్తం కూడా ఉంద‌ని అనుమానిస్తున్నారు.

దీనిని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా తీసుకుంటుంద‌ని.. పార్టీలో ఉండాలంటే ఉండొచ్చు.. లేదా బ‌య‌టికి వెళ్లొచ్చు.. అని కానీ, వెన్నుపోటు రాజ‌కీయాలు స‌హించ‌మ‌ని వారు ఆరోపిస్తున్నారు. ఇక‌పై పొంగులేటి ఎలాంటి అడుగులు వేస్తారో.. అధిష్ఠానం ఈ విష‌యాన్ని ఎలా ప‌రిష్క‌రిస్తుందో వేచి చూడాలి.