Begin typing your search above and press return to search.

తేల‌నున్న‌ మ‌మ‌త జాత‌కం.. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ భేటీ

By:  Tupaki Desk   |   6 July 2021 8:37 AM GMT
తేల‌నున్న‌ మ‌మ‌త జాత‌కం.. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ భేటీ
X
ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌లో ఉన్న అంశం ఉప ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌. తెలంగాణ‌లో ఈట‌ల రాజీనామాతో ఖాళీ అయిన‌ హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప‌ ఎన్నిక నిర్వ‌హించాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు దేశ‌వ్యాప్తంగా దాదాపు హాఫ్ సెంచ‌రీ వ‌ర‌కు ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి, వీటికి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారా? లేదా? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దేశంలో సెకండ్ వేవ్ విజృంభించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణే అనే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కూడా ప‌ట్టించుకోకుండా.. ఎన్నిక‌లపై దృష్టిసారించింద‌ని చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు న్యాయ‌స్థానాలు కూడా ఎన్నిక‌ల క‌మిష‌న్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించిన ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ పై హ‌త్య కేసు న‌మోదు చేయాల‌ని మండిప‌డింది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉప ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారా? అనే చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికీ.. సెకండ్ వేవ్ పూర్తిగా త‌గ్గిపోలేదు. నిత్యం దేశంలో 40 వేల వ‌ర‌కు కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌రోవైపు.. థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌నే భ‌యాలు కూడా ఉన్నాయి. ప‌లు నివేదిక‌లు కూడా థ‌ర్డ్ వేవ్ ఖాయ‌మ‌ని చెబుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. కేంద్రం, ఎన్నిక‌ల సంఘం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాయ‌నే ఉత్కంఠ నెల‌కొంది.

అయితే.. ఈ ఉప ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అనేది కొన్ని పార్టీల‌కు అత్యంత అవ‌స‌రంగా మారింది. ఉదాహ‌ర‌ణ‌కు మ‌మ‌తా బెన‌ర్జీ విష‌యం చూస్తే.. ఆమె ఇప్పుడు బెంగాల్ ముఖ్య‌మంత్రి. కానీ.. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. రాజ్యాంగం ప్ర‌కారం.. ఎమ్మెల్యేగా గెల‌వ‌క‌పోయిన‌ప్ప‌టికీ సీఎం కావొచ్చు. కానీ.. ఆరు నెల‌ల్లో రాష్ట్రంలోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాల్సి ఉంది. లేదంటే..ఎమ్మెల్సీగానైనా ఎన్నిక కావాలి. అలా కాని ప‌క్షంలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఆటోమేటిగ్గా ర‌ద్దైపోతుంది. అందువ‌ల్ల ఆమెకు ఉప ఎన్నిక నిర్వ‌హ‌ణ అత్య‌వ‌స‌రం.

ఈ కార‌ణంగానే.. ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి తీర‌థ్ సింగ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఆయ‌న కూడా ఎమ్మెల్యేగా గెల‌వ‌కుండానే సీఎం అయ్యారు. అయితే.. ఉన్న‌ట్టుండి ఆయ‌న రాజీనామా చేయ‌డంతో.. ఇప్ప‌ట్లో ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశం లేద‌నే ప్ర‌చారం మొద‌లైంది. వ‌చ్చేఏడాది నిర్వ‌హించే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో క‌లిపి ఉప ఎన్నిక‌లు కూడా నిర్వ‌హించాల‌ని కేంద్రం, ఈసీ భావిస్తున్నాయ‌నే చర్చ కూడా సాగుతోంది.

ఈ క్ర‌మంలో.. ఈ నెల 9వ తేదీన కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌మావేశం కాబోతోంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యే స్థానాల‌కు ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వహించాలి? క‌రోనా తీవ్ర‌త ఏంటీ? ముందుకు వెళ్తే.. ఎదుర‌య్యే ప‌రిస్థితులు ఏంటి? అన్న విషయాల‌పై సీఈసీ చ‌ర్చించ‌బోతోంది. మ‌రి, ఈ భేటీలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న దానిపైనే.. మ‌మ‌తా బెన‌ర్జీ సీఎం సీటుస‌హా.. హుజూరాబాద్ ఎన్నిక వ‌ర‌కు అన్నీ ఆధార‌ప‌డి ఉన్నాయి. మ‌రి, కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది అన్న‌ది చూడాలి.