Begin typing your search above and press return to search.

ఓర్నీ.. ఫిల్లర్ కోసం ప్లాస్టిక్ పైపా?

By:  Tupaki Desk   |   25 July 2016 6:13 AM GMT
ఓర్నీ.. ఫిల్లర్ కోసం ప్లాస్టిక్ పైపా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాల మీద నిప్పులు చెరిగేవారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని.. ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారంటూ మండిపడేవారు. అధికారులతో సుదీర్ఘంగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన ఆయన.. అక్రమ నిర్మాణాలు.. కట్టడాల వెనుక పెద్ద పెద్ద తలకాయలు చాలానే ఉన్నాయని.. వాటి గురించి వింటే షాక్ తగులుతుందన్న ఆయన.. తమ సర్కారులో అలాంటి పప్పులు ఉడకవని.. కఠిన చర్యలు తీసుకుంటామని.. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతామంటూ చాలానే మాటలు చెప్పారు.

అప్పట్లో కేసీఆర్ మాటలు విన్న వారంతా.. ఎంతకాలానికి ఒక ప్రజా సమస్య మీద ముఖ్యమంత్రి కన్నెర్ర చేశారో అనుకునే పరిస్థితి. నాడు కేసీఆర్ ప్రదర్శించిన సీరియస్ నెస్ నేపథ్యంలో.. అక్రమార్కులకు మూడిందని.. ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవని చాలానే అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అలాంటిదేమీ లేదన్న విషయం ఫిలింనగర్ లో చోటు చేసుకున్న దుర్ఘటన చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి. నిత్యం ప్రముఖులతో కళకళలాడే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఆవరణలో చేపట్టిన పోర్టికో కూలిపోయిన ఘటన సంచలనాన్ని సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. పలువురు గాయపడ్డారు.

అన్నింటికంటే షాకింగ్ అంశం ఏమిటంటే.. ఈ నిర్మాణానికి ఎలాంటి అధికారిక అనుమతులు తీసుకోకపోవటం. కల్చరల్ క్లబ్ లోని గేట్ 1 నుంచి లోపలికి ప్రవేశించే మార్గంలో వర్షానికి తడవకుండా ఉండేందుకు వీలుగా ఈ పోర్టికోను నిర్మిస్తున్నారు. అయితే.. దీని నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అన్నింటికంటే దారుణమైన విషయం ఏమిటంటే.. నిర్మాణం పరమ నాసిరకంగా ఉండటం. భారీగా ఉన్న పోర్టికో శ్లాబుకు ఆధారంగా నిర్మించిన ఫిల్లర్లలో కనీస ప్రమాణాలు కూడా పాటించకపోవటమే నిర్మాణం కూలిపోవటానికి కారణంగా చెబుతున్నారు. ఫిల్లర్ విరిగిన ప్రాంతాన్ని చూసిన వారంతా నోరు వెళ్లబెట్టే పరిస్థితి ఎందుకంటే.. ఒక ప్లాస్టిక్ పైపును ఇసుక కనిపించటం చూస్తే.. పనుల నాణ్యత ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. అక్కమార్కుల గుండెల్లో నిద్రపోతానని.. సమైక్య పాలనలో చోటు చేసుకున్న దోపిడీ తమ పాలనలో ఉండదని.. తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ఘటన మీద ఏమంటారు? దీనికి బాధ్యులైన వారిని ఎలా దండిస్తారు? రెండేళ్ల పదవీకాలంలో వ్యవస్థలోని ప్రాధమిక లోపాల్ని ఇంకా ఎందుకు సరిదిద్దలేకపోతున్నారు? లాంటి ప్రశ్నలకు ముఖ్యమంత్రి వర్యులు ఏమని చెబుతారు..?