Begin typing your search above and press return to search.

నరసాపురం మీద దృష్టిపెట్టారా?

By:  Tupaki Desk   |   19 Sep 2022 5:30 PM GMT
నరసాపురం మీద దృష్టిపెట్టారా?
X
వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే పావులు కదుపుతున్నట్లున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం.

పోయిన ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీచేసిన పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పోయినసారి ఓటమికి కారణాలను విశ్లేషించుకున్నారో లేదో తెలియదు కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం నరసాపురం నుంచి పోటీకి రెడీ అవుతున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు.

నరసాపురం నియోజకవర్గంపై పవన్ దృష్టి పెట్టడానికి రెండు కారణాలున్నాయి. మొదటిదేమో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగానే ఉండటం. రెండోదేమిటంటే క్షత్రియుల ఓట్లు గణనీయంగా ఉండటం. ఈ రెండు సామాజిక వర్గాలు కలిస్తే గెలుపు ఖాయమని పవన్ అనుకుంటున్నారట. కాపుల ఓట్లు తనకు పడతాయని పవన్ ఆశించటంలో తప్పులేదు. కానీ క్షత్రియుల ఓట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారు.

ఎలాగంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజును కలుపుకుంటే వస్తాయని అనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో రఘురాజు పోటీచేసి, తాను అసెంబ్లీకి పోటీచేస్తే ఇద్దరి గెలుపు ఖాయమని పవన్ అంచనాలు వేసుకుంటున్నారు. పవన్ ఈ అంచనాకు రావటానికి హేతువు ఏమిటో ఎవరికీ తెలీదు. వచ్చే ఎన్నికల్లో జనసేన పరిస్ధితిపై సర్వే చేయించారని అంటున్నారు. బహుశా కాపులు, క్షత్రియులు కలిస్తే పవన్ గెలుపు ఖాయమని సర్వేలో వచ్చిందేమో.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే రఘురాజు ఎంపీగా పవన్ అసెంబ్లీకి పోటీచేయాలని నిర్ణయించుకోవటం వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉంది. కానీ జనాలతో ఓట్లేయించుకోవటం వీళ్ళచేతుల్లో లేదు.

వీళ్ళ కాంబినేషన్ను మెచ్చితేనే జనాలు వీళ్ళకి ఓట్లేస్తారని పవన్ మరచిపోయినట్లున్నారు. ఇదే సమయంలో అసలు జనసేన పోటీ చేసే విషయంలోనే బోలెడంత అయోమయం ఉంది. బీజేపీతోనే కలిసుంటుందా ? లేకపోతే టీడీపీతో చేతులు కలుపుతుందా లేకపోతే ఒంటరిగా పోటీచేస్తుందా అన్నదే సస్పెన్సుగా ఉండిపోయింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.