Begin typing your search above and press return to search.

తెలంగాణ జైళ్లలో ‘హోటల్ మెనూ’

By:  Tupaki Desk   |   2 March 2016 4:59 AM GMT
తెలంగాణ జైళ్లలో ‘హోటల్ మెనూ’
X
జైలు సీన్లు చూపించే సినిమావాళ్లు అప్ గ్రేడ్ కావాల్సిన సమయం అసన్నమైంది. జైళ్ల సంస్కరణల్లో భాగంగా అక్కడ వడ్డించే ఆహారానికి సంబంధించి సమూల మార్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జైల్లోప్రయోగాత్మకంగా అమలు చేసి.. అద్భుత ఫలితం సాధించిన కొంగొత్త విధానం మిగిలిన అన్నీ జైళ్లలోనూ అమలు చేయాలని తెలంగాణ జైళ్ల శాఖ భావిస్తోంది.

జైళ్లలో క్యాంటీన్లు అంటే..?

పలు ఆఫీసుల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేసి.. పరిమిత లాభాలతో క్యాంటీన్లను నిర్వహించటం తెలిసిందే. బయట హోటళ్లతో పోలిస్తే.. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించే ఏర్పాట్లు ఉండటం తెలిసిందే. ఇదే విధానాన్ని జైళ్లల్లో అమలు చేయాలన్నది జైళ్ల శాఖ ఆలోచన.

ఎందుకిలా..?

జైల్లో భోజనం అనగానే.. చిప్పకూడు.. నీళ్ల పప్పు.. లేదంటే నీళ్ల చారు. ఇవి మాత్రమే. దీని కారణంగా పలువురు ఖైదీలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. పోషక లోపంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు.. మంచి భోజనం కోసం ఆవురావురమంటున్న ఖైదీలు గుట్టుచప్పుడు కాకుండా.. జైళ్లలో పని చేసే సిబ్బందికి భారీగా లంచాలు ఇచ్చి నచ్చిన ఫుడ్ ను బయట నుంచి తెప్పించుకుంటున్నారు. పెద్ద ఎత్తున సాగుతున్న ఈ దందాకు చెక్ పెట్టాలన్న ఆలోచనతో ఈ వినూత్న ఆలోచన తెరపైకి తీసుకొచ్చారు.

ఇంతకీ కరీంనగర్ జైల్లో ఏం చేశారు

ఇలా ఆలోచించిన కరీంనగర్ జైలు అధికారులు.. బయట హోటళ్ల మాదిరే జైల్లో కూడా పలు రకాలు ఐటెమ్స్ ను వండి.. వడ్డించాలని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా కొత్త మెనూను సిద్ధం చేశారు. ఆఫీసుల్లో క్యాంటీన్ల నిర్వహణ తరహాలోనే పలురకాల ఐటెమ్స్ ను వండి ఖైదీలకు వడ్డించాలని నిర్ణయించారు.

కొత్త మెనూలో ఏమేం ఉంటాయ్

కొత్త మెనూ ప్రకారం ఉదయం ఇడ్లీ.. దోశె.. పూరి.. వడ.. ఉప్మా వడ్డిస్తారు. ఇక.. సాయంత్రం చికెన్ బిర్యానీ.. ఎగ్ బిర్యానీ.. వెజ్ ప్రైడ్ రైస్.. ఎగ్ ప్రైడ్ రైస్.. చికెన్ ప్రైడ్ రైస్.. చపాతీలు అందిస్తారు.

ధర మాటేమిటి?

జైళ్లలో ఏర్పాటు చేస్తున్న ఈ మోడర్న్ క్యాంటీన్లకు సంబంధించి.. ఫుడ్ తయారు చేయటానికి అయ్యే వస్తువుల ఖర్చు.. నిర్వహణ ఖర్చుకు 20 శాతం లాభాల్ని కలుపుకొని.. ఎంతమొత్తం అవుతుందో లెక్క వేస్తారు. దాని ప్రకారం ధరల్ని నిర్ణయిస్తారు. అంటే.. బయటతో పోలిస్తే.. తక్కువ ధరకే నాణ్యమైన ఫుడ్ లభించటంతో పాటు.. జైళ్లలో అవినీతికి చెక్ పెట్టేందుకు వీలవుతుంది.