Begin typing your search above and press return to search.

అమెరికా వీసా కోసం వచ్చి.. ఫుడ్ పాయిజన్ కు బలి

By:  Tupaki Desk   |   12 Feb 2020 8:30 AM GMT
అమెరికా వీసా కోసం వచ్చి.. ఫుడ్ పాయిజన్ కు బలి
X
అమెరికాకు పిలుపు వచ్చింది.. ఇంకేం.. వారి ఆనందానికి అవధులు లేవు.. భారీ జీతం.. మంచి జీవితం ఊహించుకొని ఒక చిన్న కుటుంబం ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చింది. అమెరికా వీసా స్టాంపింగ్ చేయించుకునేందుకు హైదరాబాద్ లో బస చేసింది. కానీ వారి ఆశలను.. వారి కుటుంబాన్ని తాజాగా హైదరాబాద్ లోని ఓ హోటల్ కలుషిత ఆహారంతో చిదిమేసింది. ఈ ఘోరం అందరినీ కంతటడిపెట్టిస్తోంది.

ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబంలో హైదరాబాద్ హోటల్ విషాదం నింపింది. ఎన్నో ఆశలతో అమెరికా పోదామని యోచించిన వారిని ఆస్పత్రి పాలు చేసింది. ఒక కుమారుడు చనిపోయేలా చేసింది. మరో కుమారుడిని చావు బతుకుల మధ్య ఉండేలా చేసింది. పచ్చని సంసారంలో నిప్పులు పోసింది హైదరాబాద్ బేగంపేటలోని మానస రోవర్ హోటల్.

*ఎవరి సాఫ్ట్ వేర్ ఇంజినీర్..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ముఠాపురానికి చెందిన ఏటుకూరి రవినారాయణ బెంగళూరులోని ఇమేజిన్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయనకు అమెరికాలో జాబ్ వచ్చింది. కంపెనీ తరుఫున అమెరికా వెళ్లాల్సి ఉండడంతో అమెరికా వీసా స్టాపింగ్ కోసం రవినారాయణ భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు.

*ప్రమాదానికి కారకులెవరు?
హైదరాబాద్ బేగంపేటలోని మానస సరోవర్ హోటల్లో రవినారాయణ కుటుంబం బస చేసింది. పన్నీర్ కర్రీతోపాటు రోటీని వీరి కుటుంబం ఆర్డర్ చేసింది. తిన్న కాసేపటికే వారికి కడుపు నొప్పితో వాంతులు మొదలయ్యాయి. తోటి వారు గమనించి రవినారాయణతోపాటు అతడి భార్య శ్రీవిద్య, ఇద్దరు పిల్లలను బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి లో చికిత్స పొందుతూ రెండేళ్ల ‘విహాన్’ మృతిచెందడం విషాదం నింపింది. దంపతులు చికిత్స పొందుతున్నారు. మరో కుమారుడు ఐసీయూ లో ఉన్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.

*హోటల్ సిబ్బంది దుర్మార్గం..
ఒక కుటుంబం తమ హోటల్ లోని ఫుడ్డును తిని ఫుడ్ పాయిజనింగ్ తో అస్వస్థత కు గురైనా సదురు మానసరోవర్ హోటల్ సిబ్బంది తమకేం పట్టనట్టుగా వ్యవహరించారని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. చికిత్స కోసం కనీసం ఆసుపత్రికి పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. అదే విహాన్ మరణానికి కారణమని మండిపడుతున్నారు.

*స్పందించిన అధికారులు
సాఫ్ట్ వేర్ కుటుంబం కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురికావడం.. ఓ బాలుడు మృతి చెందడంతో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు మానసరోవర్ హోటల్ పై దాడి చేశారు. ఫుడ్ శాంపిల్స్ ను సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు.

కాగా బాలుడి మృతికి కారణాలేంటన్నది పోస్టుమార్టం నివేదిక లో తేలుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని తెలిపారు.