Begin typing your search above and press return to search.

ఫార్లమెంటు క్యాంటీన్ లోనూ ధరలు పెరిగాయ్

By:  Tupaki Desk   |   1 Jan 2016 7:45 AM GMT
ఫార్లమెంటు క్యాంటీన్ లోనూ ధరలు పెరిగాయ్
X
వాతలు ఎప్పుడూ సామాన్యులకే అన్నది సాధారణ నానుడి. ప్రభుత్వాలు ఏం వచ్చినా త్యాగాల్ని ప్రజల్ని చేయమంటాయే తప్పించి.. తమ ప్రభుత్వం చేసే త్యాగాల గురించి ప్రస్తావించరు. అసలు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగదు కూడా. ఇందుకు మోడీ సర్కారు కూడా మినహాయింపేమీ కాదు. త్యాగాలు చేయనప్పటికీ.. ధరా భారాన్ని పంచుకోవటానికి.. పెంపు కొందరికే కాదు.. అందరికి అన్న బావన కలిగించే ప్రయత్నం తాజాగా మోడీ సర్కారు చేసింది.

దేశంలో ధరలు మండిపోతున్నా.. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నా.. పార్లమెంటులో మాత్రం ధరలు కారుచౌకగా ఉండటం తెలిసిందే. శాఖాహార భోజనం ఓ మోస్తరు హోటల్లో అయినా రూ.50 పెట్టందే రాని ఈ రోజుల్లో.. లక్షలాది రూపాయిల జీతాలు పొందే నేతలు కొలువు తీరిన పార్లమెంటు క్యాంటీన్ లో మాత్రం రూ.18 లభించే పరిస్థితి. ఇందుకోసం విలువైన ప్రజాధనాన్ని.. నేతల ఆహారానికి ఖర్చు చేయటం జరుగుతోంది. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి.

అయినప్పటికీ లైట్ తీసుకునే ప్రభుత్వాలు ఇప్పటివరకూ నడిచాయి. మరి.. ఏమనుకున్నారో ఏమో కానీ.. మోడీ సర్కారు మాత్రం.. ఈ విషయంలో కాస్తంత కటువుగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. కొత్త సంవత్సరం రోజున కొంగొత్త ధరలతో పార్లమెంటు క్యాంటీన్ ఆహారపదార్థాల్ని అందించనుంది. ఇప్పటివరకూ శాఖాహార భోజనం రూ.18కి అందిస్తే.. ఈ రోజు నుంచి రూ.30 వసూలు చేస్తారు. మాంసాహార భోజనం ధర కూడా పెరిగింది. ఇంతకాలం రూ.33 ఉన్న నాన్ వెజ్ మీల్స్ రూ.60 కానుంది.

అదే బాటలో కోడికూర ధరను కూడా పెంచేశారు. ఇప్పటివరకూ రూ.29గా ఉన్నది కాస్త రూ.40 కానుంది. అయితే.. టీ.. రోటీ లాంటివి మాత్రం ఎప్పటిలానే కారుచౌకగా లభించనున్నాయి.