Begin typing your search above and press return to search.

ఎవరి పెళ్లి కోసం రాహుల్ నేపాల్ కు వెళ్లారు? ఆమె ఎవరు? ఏం చేస్తుంటారు?

By:  Tupaki Desk   |   4 May 2022 4:29 AM GMT
ఎవరి పెళ్లి కోసం రాహుల్ నేపాల్ కు వెళ్లారు? ఆమె ఎవరు? ఏం చేస్తుంటారు?
X
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. అదే సమయంలో 2024 కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం సాగుతున్న రాహుల్ గాంధీ కూడా విదేశాల్లోనే ఉన్నారు. ఇలాంటి వేళ.. ఆయనకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా బయటకు రావటం.. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు.. ప్రతివిమర్శలు.. ఆరోపణలు జోరందుకున్నాయి. ఒక విపక్ష నేత.. భవిష్యత్తు దేశ ప్రధానిగా చెప్పుకునే నేత పబ్ కు వెళ్లటం.. ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నారన్న ప్రచారం జోరందుకోవటమే కాదు.. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద కష్టంగా మారింది.

అయితే.. రాహుల్ మీద జరుగుతున్న ప్రచారమంతా దుష్ప్రచారమని.. ఆయన్ను రాజకీయంగా దెబ్బ తీయటానికి చేస్తున్న ప్రయత్నంగా చెబుతున్నారు. అసలు రాహుల్ గాంధీ నేపాల్ ఎందుకు వెళ్లారన్న ప్రశ్నను సంధించి మరీ సమాధానం చెబుతున్నారు. ఆయన వెళ్లింది ఒక పాత్రికేయురాలి పెళ్లికి హాజరు కావటానికి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే.. ఒక స్నేహితురాలి పెళ్లి కోసం ఐదు రోజులు విదేశీ పర్యటన అవసరమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే.. అసలీ నేపాలీ స్నేహితురాలు ఎవరు? ఆమె ఏం చేస్తున్నారన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆ వివరాల్ని సేకరిస్తే.. రాహుల్ నేపాల్ పర్యటనకు కారణంగా.. ఆయన స్నేహితురాలు కమ్ జర్నలిస్టు సుమ్నిమా ఉదాస్ పెళ్లి వేడుకే కారణంగా చెప్పాలి. ఆమె పెళ్లి కోసం భారత్ కు చెందిన మరికొందరు వీఐపీలు కూడా హాజరవుతున్నట్లు చెబుతున్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ ఇంటర్నేషనల్ కు ఢిల్లీ పాత్రికేయురాలిగా పని చేశారు. దేశంలోని కీలక రాజకీయ.. సామాజిక.. పర్యావరణ రంగాలకు సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఆమె ఇచ్చారు.

దేశంలోసంచలనంగా మారిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసుతో పాటు మలేషియా విమానం కుప్పకూలటం.. కామన్వెల్త్ అవినీతి స్కాం మీదా ఆమె కథనాలు సంచలనమయ్యాయి. 2001 నుంచి 2017 వరకు సీఎన్ఎన్ లో పని చేసిన ఆమె.. 2018 తర్వాత నుంచి లుంబినీ మ్యూజియం ఫౌండర్ కమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె పని తీరుతో బోలెడన్ని అవార్డుల్ని సొంతం చేసుకున్నారని చెబుతారు.

ఇక.. సుమ్నిమా ఉదాస్ తండ్రి భీమ్ ఉదాస్ దౌత్య అధికారిగా పని చేయటం.. మయన్మార్ లో నేపాల్ రాయబారిగా సేవలు అందించారు. ఆమె చిన్నతనంలో దాదాపు పది దేశాల్లో నివాసం ఉన్న ఆమె.. వాషింగ్టన్ అండ్ లీ వర్సిటీలో బ్రాడ్ కాస్ట్ జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. ఆక్స ఫర్డ్ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. మంగళవారం ఆమె పెళ్లి జరుగుతుండటంతో రాహుల్ వెల్లటం.. ఆ సందర్భంగా తాజా వివాదం తెర మీదకు రావటం జరిగింది. మరీ వ్యవహారంపై రాహుల్ మరెలా రియాక్టు అవుతారో చూడాలి.