Begin typing your search above and press return to search.

దిగ్గజ సంస్థలో ఉద్యోగులతో బలవంతపు రాజీనామాలు!

By:  Tupaki Desk   |   29 Oct 2022 8:30 AM GMT
దిగ్గజ సంస్థలో ఉద్యోగులతో బలవంతపు రాజీనామాలు!
X
బెంగళూరుకు చెందిన ఎడ్యుడెక్‌ దిగ్గజం.. బైజూస్‌ ఉద్యోగులతో బలవంతపు రాజీనామాలు చేయిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఐటీ పార్కులోని బైజూస్‌ కార్యాలయంలో 170 మంది ఉద్యోగులను రాజీనామాలు చేయాలని ఆదేశించిన విషయం వివాదాస్పదమైంది. ఉద్యోగులంతా కేరళ కార్మిక మంత్రి శివన్‌కుట్టిని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.

ఇప్పుడు తిరువనంతపురంలో చేసినట్టే తమ ప్రధాన కార్యాలయం ఉన్న బెంగళూరులోనూ బైజూస్‌ ఉద్యోగులతో బలవంతపు రాజీనామాలు చేయిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఉద్యోగులు వెంటనే రాజీనామా చేయాలని లేదా వారి కెరీర్‌ ప్రభావితమయ్యేలా తొలగింపును ఎదుర్కోవాల్సి ఉంటుందని బైజూస్‌ హెచ్చరించినట్టు తెలుస్తోంది.

బైజూస్‌ బెంగళూరు ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (కేఐటీయూ) పేర్కొనడం ఇక్కడ గమనార్హం.

కేఐటీయూ సెక్రటరీ సూరజ్‌ నిడియంగ మీడియాతో మాట్లాడుతూ.. బైజూస్‌లోని ఉద్యోగులు రాజీనామా చేయడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. అయితే.. యాజమాన్యం బలవంతం చేస్తోందని చెప్పారు. ఇప్పటికే హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగుల నుంచి బలవంతంగా రాజీనామాలు చేయించుకోవడంలో మునిగి ఉందని ఆయన చెప్పారు. అయితే కంపెనీ నుండి తొలగింపులకు సంబంధించి వ్రాతపూర్వక సమాచారమేదీ లేదని ఆయన పేర్కొన్నారు.

కాగా గత వారం రోజులుగా హెచ్‌ఆర్‌ డిపార్ట్‌ మెంట్‌ ఉద్యోగులకు ఫోన్‌ చేసి స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించాలని కోరుతోందని ఉద్యోగులు చెబుతున్నారు.

మరోవైపు తిరువనంతపురంలో ఉద్యోగుల తొలగింపు వివాదాస్పదం కావడంతో బైజూస్‌ సర్దుబాటు చర్యలకు దిగింది. అక్కడి ఉద్యోగులకు కేరళ కార్మిక మంత్రికి ఫిర్యాదు చేయడంతో తిరువనంతపురంలో పనిచేసే ఉద్యోగులను వేరే చోటకు వారిని బదిలీ చేసింది.

కాగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు, కోవిడ్‌ కల్లోలం సృష్టించిన ప్రభావం నుంచి కంపెనీలు కోలుకోలేకపోవడం, ప్రస్తుతం స్కూళ్లు యధావిధిగా నడుస్తుండటంతో బైజూస్‌కు ఆదరణ తగ్గింది. దీంతో కొంతమంది ఉద్యోగులను తొలగించుకునే పనిలో బైజూస్‌ ఉంది.

కాగా బైజూస్‌లో మొత్తం 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 2500 మందిని తొలగిస్తామని ఇటీవల బైజూస్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. దశలవారీగా మొత్తం 5 శాతం (2500) మందిని తొలగిస్తామని పేర్కొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.