Begin typing your search above and press return to search.

పేరొక్కటే తెలుగు..ప్లాను, పైసలు అన్నీ ఫారినే

By:  Tupaki Desk   |   22 April 2016 11:30 AM GMT
పేరొక్కటే తెలుగు..ప్లాను, పైసలు అన్నీ ఫారినే
X
నవ్యాంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి పూర్తిగా విదేశీ వాసన కొట్టనుంది. తెలుగు నేలపై ఉండడం... తెలుగు పేరు కలిగి ఉండడం తప్ప అమరావతిలో ఇంకేదీ స్వదేశీ అంశం కనిపించడం లేదు. అమరావతి ప్లానును సింగపూర్ ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణం కూడా వారి కనుసన్నల్లోనే సాగనుంది. ఇక నిర్మాణానికి కావాల్సిన నిధులూ విదేశాల నుంచే రానున్నాయి. దీంతో విదేశీ నిధులు అనగానే, చాలామందిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మన రాజధాని మనకుంటుందా ? లేదంటే ఇంకేదైనా దేశం గుప్పిట్లో ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజధాని అమరావతి పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో నిర్మాణం కానుంది. ఇంతవరకు అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తామని చెప్పుకొస్తున్న సిఎం చంద్రబాబు దానికి సంబంధించిన ఆర్థిక పరమైన వివరాలను వెల్లడించలేదు. అయితే... తాజాగా 'యుకె పెట్టుబడిదారులకు అవకాశాలు-21వ శతాబ్దపు రాజధాని అమరావతి' పేరుతో పెట్టుబడులకున్న అవకాశాలను, అవి ఎక్కడి నుండి తీసుకొస్తారనే విషయాలను సవివరంగా పేర్కొంటూ ఓ నివేదికను రూపొందించారు. ఈ నివేదికలో 11 ప్రాజెక్టుల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వా నించనున్నారు. బీఓటీ పద్ధతిలో ఒక ప్రాజెక్టు చేపట్టనున్నారు. మూడు ప్రాజెక్టులను ఇపిసి విధానంలో చేపట్టనున్నారు. రాజధానిలో పేదలకు అందు బాటులో ఉండే ఇళ్లను నిర్మించే ప్రాజెక్టులనూ విదేశీ పెట్టుబడులతోనే నిర్మించనున్నారు. ఇందుకు అమరావతి డెవలప్‌మెంట్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. గతంలో దీన్ని క్యాపిటల్‌ సిటీ డెవలప్‌ మెంట్‌ అండ్‌ మేనేజ్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (సిసిడిఎంసి)గా పేర్కొన్నారు. దీనికి ప్రత్యేకంగా మార్పులేమీ చేయక పోయినా వాడుకలో అమరావతి డెవలప్‌ మెంట్‌ కంపెనీ అనే అంటున్నారు. మొత్తం రాజధానిలో చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలు, వాటికి ఎంత ఖర్చవుతుంది, ఎంత కాలానికి పూర్తి చేయాలనే విషయాలపై సవివరంగా దీన్ని రూపొందించిన నివేదికను చూస్తే అమరావతి మొత్తం విదేశీ నిర్మాణమేననిపిస్తోంది.

మరోవైపు 2020 నాటికే నిర్మాణాలు పూర్తి చేస్తామని చెబుతున్నారు. వీటిలో 210 కిలో మీటర్ల పొడవున నిర్మించే అవుటర్‌ రింగురోడ్డుకు 200 మిలియన్లు ఖర్చవుతుందని, దీనిలో పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టుకు 50700 మిలియన్లు - ఆర్టిరియల్‌ - ఇతర రోడ్లకు 24480 మిలియన్లు - వరద ముంపు నివారణకు 22970 మిలియన్లు - మురుగునీటి పారుదల ట్రీట్‌ మెంట్‌ కు 14,470 మిలియన్లు - విద్యుత్‌ ఉత్పత్తికి 1,25,000 మిలియన్లు - హౌసింగ్‌ కు 11000 మిలియన్లు - పేదలకు అందుబాటు ధరలో ఉండే ఇళ్ల నిర్మాణానికి 8400 మిలియన్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నిటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో తీసుకోనున్నట్లు అందులో పేర్కొన్నారు. చెత్త నిర్వహణకు 2500 మిలియన్లు - హెల్త్‌ కేర్‌ కు 2310 మిలియన్లు - ఎక్స్‌ప్రెస్‌ రహదారికి 6000 మిలియన్లు ఖర్చవుతుందని తెలిపారు. వీటినీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలోనే తీసుకోనున్నారు. వీటిలోపాటు యూనివర్సిటీ జోన్‌ ఏర్పాటుకు 5000 మిలియన్లు - కృష్ణా రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు 31,310 మిలియన్లు - పారిశ్రామిక జోన్‌ కు 7000 మిలియన్లు ఖర్చవుతుందని ఈ మూడు ప్రాజెక్టులను ఇపిసి పద్ధతిలో నిర్మించనున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లు - ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ప్రాంతానికి 2640 మిలియన్లు ఖర్చవుతుందని, దీన్ని బిఒటి పద్ధతిలో చేపడతామని తెలిపారు. మొత్తానికి అమరావతి నిర్మాణంలో పైసాపైసా విదేశాలే పెట్టుబడులు పెడుతుండడంతో వారి డిమాండ్లు ఎలా ఉంటాయో అన్న భయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.