Begin typing your search above and press return to search.

పోస్టల్ శాఖ కొత్త ప్రయోగం..ఫారిన్ కు సరుకులు ఈజీగానే పంపొచ్చు

By:  Tupaki Desk   |   6 Sep 2019 10:16 AM GMT
పోస్టల్ శాఖ కొత్త ప్రయోగం..ఫారిన్ కు సరుకులు ఈజీగానే పంపొచ్చు
X
ఎక్కడో సుదూర తీరాల్లో విదేశాల్లో మన పిల్లలో - బంధువులో ఉన్నారనుకోండి... వారికి మన ఇంటి నుంచి పంపే వస్తువులు అపురూపమే కదా. మన రుచుల కోసం వారు అర్రులు చాస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే కదా. మరి అలాంటి వారికి ఏదో ప్రత్యేక వంటకాలో - ఇంకేదో పంపాలంటే... నిన్నటిదాకా చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవమే కదా. విదేశాలకు సదరు వస్తువులు - ఇతరత్రా పోస్టులు పంపేందుకు పోస్టాపీసులు ఉన్నా... సరుకుల విషయంలో చాలా ఇబ్బంది ఉండేది. దీంతో ప్రైవేట్ కొరియర్ సేవలతో జేబులు గుల్ల చేసుకున్న అనుభవాలూ మనకున్నాయి. ఇలాంటి మన కోసం ఇప్పుడు భారత తపాలా శాఖ ఓ సరికొత్త ప్రయోగం ద్వారా గుడ్ న్యూస్ వినిపించింది.

ఇకపై ఏ బాదర బందీ లేకుండా విదేశాల్లోని మనోళ్లకు ఈజీగానే పార్సిళ్లను పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ మంచి వార్తను అందించింది. ఫారిన్ పోస్టాఫీసుల పేరిట హైదరాబాద్ లోని రెండు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటైన రెండు శాఖల ద్వారా ఇకపై మనం విదేశాల్లోని మన వారికి పంపాలనుకున్న వస్తువులను ఈజీగానే పంపే వీలు చిక్కిందని చెప్పక తప్పదు. ప్రస్తుతం మెహిదీపట్నం - అక్కడికి సమీపంలోనే ఉన్న హుమాయూన్ నగర్ పోస్టాఫీసుల్లో కస్టమ్స్ శాఖ ఫారిన్ పోస్టాపీసుల పేరిట రెండు కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఈ రెండు కార్యాలయాల ద్వారానే మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా, అతి తక్కువ ఖర్చుతోనే విదేశాల్లోని మనోళ్లకు వస్తువులను పంపే వీలు చిక్కింది.

ఇక్కడేం చేస్తారన్న విషయానికి వస్తే... విదేశాల్లోని మనోళ్లకు పంపాలనుకున్న వస్తువులను ఈ రెండు కార్యాలయాలకు తీసుకువెళితే... ప్యాకింగ్ కు ముందే వాటిని తనిఖీ చేసే కస్టమ్స్ అధికారులు... ఆ తర్వాత అవి మనోళ్లకు చేరేదాకా ఎలాంటి తనిఖీలు లేకుండా - అసలు ప్యాకింగ్ నే విప్పకుండా అందజేస్తారు. ఇక ప్రైవేట్ కొరియర్స్ తో పోల్చుకుంటే ఖర్చు కూడా చాలా తక్కేవనట. సో... ఇది విదేశాల్లో బంధువులో - పిల్లలో ఉన్న మనోళ్లకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ కిందే లెక్క. ఇలా అక్కడి మనోళ్లకు ఫారిన్ పోస్టాఫీసుల ద్వారా ఒకే సారి 30 కిలోలకు మించకుండా సరుకులు - ఇతర వంటకాలో - మందులో... ఏవైనా పంపే వీలుందట. అయితే చేపలతో చేసిన వంటకాలు - నూనెలు మాత్రం నిషిద్ధమట. కస్టమ్స్ అధికారులు పెట్టిన కొద్దిపాటి నిబంధనలను పాటిస్తే... విదేశాల్లో మనోళ్లకు ఏం కావాలంటే అది పంపే వెసులుబాటు మనకు చిక్కేసినట్టేనన్న మాట. ఈ కొత్త తరహా వెసులుబాటుపై పోస్టల్ శాఖ నగరంలో విస్తృతంగా ప్రచారం కూడా చేయనుందట.