Begin typing your search above and press return to search.

రాజస్థాన్ లో విదేశీయులు ఏం చేశారంటే..

By:  Tupaki Desk   |   28 Nov 2016 5:36 AM GMT
రాజస్థాన్ లో విదేశీయులు ఏం చేశారంటే..
X
ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కారణంగా దేశ ప్రజలు మాత్రమే కాదు.. విదేశీయులు కూడా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. నోట్ల రద్దు.. బ్యాంకుల వద్ద పెద్ద క్యూలు.. ఏటీఎం సెంటర్లు పని చేయకపోవటం వారిని ఎంతగా ఇబ్బంది పెడుతుందన్న విషయాన్ని చెప్పేందుకు తాజా ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా చెప్పాలి.

జర్మనీ.. ఆస్ట్రేలియాకు చెందిన 10 నుంచి 12 మంది ఉన్న బృందం ఒకటి రాజస్థాన్ లో జరిగే పుష్కర్ జాతరకు వచ్చారు. ఈ నెల 8న వారు రాజస్థాన్ కు చేరుకున్నారు. అప్పుడే ప్రధాని పెద్దనోట్ల రద్దునిర్ణయాన్ని వెల్లడించారు.దీంతో.. వారికి నోట్ల కష్టంలో చిక్కుకుపోయారు. తమ దగ్గరున్న చిన్న నోట్లతో కాలం గడిపిన వీరికి.. ఏటీఎంలు పని చేయకపోవటం పెద్ద శాపంగా మారింది. ఢిల్లీకి వెళ్లేందుకు అవసరమైన డబ్బులు వీరి చేతిలో లేకపోవటంతో తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు.

దీంతో.. ఈ బృందం రాజస్థాన్ లోని పుష్కర్ వీధుల్లో తమకున్న కళల్ని ప్రదర్శిస్తూ ప్రత్యేక ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ బృందంలోని అబ్బాయిలు సంగీత వాయిద్యాలతో తమకున్న కళను ప్రదర్శిస్తుంటే.. అమ్మాయిలు వ్యాయామ విన్యాసాల్ని ప్రదర్శిస్తున్నారు. వీరిని చూసేందుకు భారీగా జనం గుమిగూడటం.. తమ ప్రదర్శన అయిపోయాక.. తమ పరిస్థితిని తెలిపేలా ప్లకార్డులు ప్రదర్శించటంతో అక్కడి వారు వారికి తమకుతోచినంత డబ్బులు ఇస్తున్నారు.

ఇప్పటివరకూ అలా రూ.2600 కూడబెట్టినట్లుగా ఆ బృందంలోని సభ్యలు చెబుతున్నారు. ఇలా కష్టపడి ఢిల్లీకి వెళ్లేందుకు అవసరమైన టికెట్ డబ్బులు సమకూర్చుకోగలిగితే.. అక్కడి ఎంబసీ ద్వారా తమ దేశానికి వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటామని చెబుతున్నారు. నిజానికి ఇలాంటి ఇబ్బందులు దేశానికి వచ్చిన పలువురు విదేశీయులకు కలిగే అవకాశం ఉంది. అయితే.. ఇలాంటి ఇబ్బందులు ఉన్న విదేశీయుల్ని ఆదుకునేందుకు.. వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా.. బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాల్సింది.

అలా కాదనుకుంటే.. వారి అవసరాలు తీర్చేలా ఆదేశాలు దేశ వ్యాప్తంగా జారీచేస్తే.. అతిధులుగా వచ్చే వారి ఇబ్బందులు తీర్చినట్లు అవుతుంది. అంతేకాదు.. ఏదైనా పరిమిత మొత్తాన్ని విదేశీయులకు ఏ వ్యాపారసంస్థ అందజేసినా వారికి ఎంతోకొంత నజరానా ఇస్తామన్న ప్రకటనను ప్రభుత్వం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంవ్యక్తమవుతోంది. అలాంటి ఇలాంటి నిర్ణయం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు వీలుగా వారి వద్ద ఉన్న పాతనోట్లను తీసుకునే వారు.. వారి ధ్రువీకరణ పత్రాల్ని జిరాక్స్ కింద సేకరిస్తేసరిపోతుంది. అతిధులుగా దేశానికి వచ్చిన వారు ఇబ్బంది పడకుండా చూసుకోవటం ప్రభుత్వ బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/