Begin typing your search above and press return to search.

జగన్ ఓటు తొలగించాలని.. ఫామ్ సెవెన్!

By:  Tupaki Desk   |   13 March 2019 4:29 AM GMT
జగన్ ఓటు తొలగించాలని.. ఫామ్ సెవెన్!
X
ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం వేడి ఇంకా తగ్గడం లేదు. భారీ ఎత్తున ఓట్లు తొలగింపుకు గురి అయ్యాయనే వార్తలు వస్తున్నాయి. ఏకంగా ఎనిమిది లక్షల ఓట్ల తొలగింపుకు తమ వద్దకు దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. వాటిల్లో చాలా వరకూ స్వచ్ఛందంగా ఆయా వ్యక్తులు పెట్టుకున్న అప్లికేషన్లే అని ఈసీ పేర్కొంది. ఫామ్ సెవెన్ రూపంలో ఓట్ల రద్దు గురించి అప్లికేషన్లు వచ్చాయని ఈసీ ప్రకటించింది.

అయితే ఆ అప్లికేషన్లను పరిశీలిస్తూ ఉన్నట్టుగా - అందరి ఓట్లనూ తొలగించలేదని ఈసీ తెలిపింది. కొన్ని అక్రమ దరఖాస్తులను కూడా గుర్తించినట్టుగా ఈసీ ప్రకటించింది. అలా అక్రమంగా ఓట్ల తొలగింపుకు అప్లికేషన్లను పెట్టిన వారిని - తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిని ఊరికే వదిలేది లేదని.. వారిపై కేసులు నమోదు చేయనున్నట్టుగా ఈసీ ప్రకటించింది.

అందుకు సంబంధించి రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. మొత్తంగా ఆ వ్యవహారం అలా వేడి మీద ఉండగానే.. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. తొలి దశలోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టం అయ్యింది. దీంతో.. ఆ అంశం అలా మరుగున పడిపోయింది.

ఆ సంగతలా ఉంటే.. మరో సంచలనమే చోటు చేసుకుంది. జగన్ ఓటు ను జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఒక అజ్ఞాత వ్యక్తి పులివెందుల్లో తహశీల్దారుకు దరఖాస్తు చేయడం విశేషం. ఫామ్ సెవెన్ ద్వారా జగన్ ఓటు తొలగింపును కోరుతూ ఒక దరఖాస్తు వచ్చింది. ఈ దరఖాస్తును పరిశీలించిన అధికారులు ఆశ్చర్యపోయారు. జగన్ కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో వారు మండి పడుతూ ఉన్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని తహశీళ్దారును వారు కోరారు. అలాగే పులివెందుల్లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. మొత్తానికి.. ప్రతిపక్ష నేత ఓటునే జాబితా నుంచి గల్లంతు చేయాలనే స్థాయిలో ఓట్ల తొలగింపు రాజకీయం ఏపీలో జరుగుతోందని ఈ ఘటనతో స్పష్టం అవుతోంది.

ఇలాంటి నేపథ్యంలో సామాన్యుల ఓట్ల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక పెద్దగా సమయం లేదు. మరో మూడు రోజులు మాత్రమే ఓటర్ల జాబితా విషయంలో పేరు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది! ఎవరికి వారు జాగ్రత్త పడాల్సిందే!