Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను మాష్టారు మరోసారి తప్పుపట్టారు

By:  Tupaki Desk   |   22 Aug 2016 8:00 AM GMT
కేసీఆర్ ను మాష్టారు మరోసారి తప్పుపట్టారు
X
విషయం ఏదైనా కానీ సమర్థంగా వాదనలు వినిపించటం.. తమ చుట్టూ ఉన్నవారిని కన్వీన్స్ చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దిట్టన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా అలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తి తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. తాను నమ్మిన విషయాన్ని నలుగురికి నమ్మకం కలిగేలా చెప్పటం.. దానిపై తన ప్రత్యర్థులు వేసే కౌంటర్లను సమర్థంగా ఎదుర్కొనటం కోదండం మాష్టారికి అలవాటే.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనలోని టాలెంట్ అందరికి అర్థమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలాంటి పదవులు తీసుకోకుండా తెలంగాణ ప్రజానీకం తరఫున పోరాడతానని చెప్పి.. అదే మాట మీద నిలిచిన కీలక నేతల్లో కోదండరాం ఒక్కరే కనిపిస్తారు. తెలంగాణ సర్కారుపై విమర్శలు చేయకుండా రెండు సంవత్సరాల పాటు ఓపిగ్గా ఉన్న కోదండం మాష్టారు ఈ మధ్యన నిరసన గళం వినిపిస్తున్నారు. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా జోనల్ వ్యవస్థను తీసేయాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దీనిపై కోదండం మాష్టారు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎప్పుడూ లేని విధంగా తన విమర్శలకు ఊతంగా స్వర్గీయ జయశంకర్ సార్ ను తెచ్చుకోవటం గమనార్హం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాల్సిందేనని.. అధికారంలో ఉన్నాం కాబట్టి మేమే నిర్ణయాలు తీసుకుంటామన్న ధోరణి తగదని చెప్పిన ఆయన.. జయశంకర్ సార్ కానీ బతికి ఉంటే ప్రజాస్వామిక ఆలోచనల్ని మరింత వివరంగా చెప్పేవారంటూ తనదైన శైలిలో ప్రభుత్వానికి చురకలు అంటించారు.

జోనల్ వ్యవస్థపై లోతైన అధ్యయనం జరగాలనీ.. స్థానిక రిజర్వేషన్లపై ఉద్యోగులు.. నిరుద్యోగులకు అనేక అనుమానాలు.. భయాందోళనలు.. ప్రశ్నలు ఉన్నాయని.. వాటిని నివృతి చేసే అవకాశం ప్రభుత్వం కల్పించాలని వ్యాఖ్యానించారు. మొన్నటి వరకూ ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన కోదండం మాష్టారు తాజాగా జోనల్ వ్యవస్థ రద్దుపై ప్రభుత్వ ధోరణిని తప్పు పట్టేలా వ్యాఖ్యానించటం గమనార్హం. తాము ప్రాజెక్టుల్నివ్యతిరేకించటం లేదని.. ప్రాజెక్టుల నిర్మాణం ముందే వాటికి సంబంధించిన సమగ్ర ఆలోచనలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నట్లుగా వెల్లడించారు. కేసీఆర్ సర్కారు నిర్ణయాల్ని నిర్మాణాత్మకంగా తప్పులు ఎత్తి చూపిస్తున్న కోదండరాం.. జోనల్ వ్యవస్థ మీద గళం విప్పిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.