Begin typing your search above and press return to search.

బాబుకు భారీ షాక్ ఇవ్వనున్న కడప కీలక నేత?

By:  Tupaki Desk   |   19 Aug 2019 10:55 AM GMT
బాబుకు భారీ షాక్ ఇవ్వనున్న కడప కీలక నేత?
X
పార్టీ పవర్లో ఉన్నా లేకున్నా.. ఒకే పార్టీలో కొనసాగటం కాలం చెల్లిన విధానం. అవసరం.. అవకాశం వస్తుందంటే చాలు పార్టీ ఏదైనా సరే మారిపోవటం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. పార్టీకి ప్రజాబలం లేకున్నా ఫర్లేదు.. తొలుత బలమైన నేతల్ని గుర్తించి గంపగుత్తగా పార్టీలో చేర్పించటం.. ప్రజల్లో అటెన్షన్ వచ్చేలా చేయటం.. వారి మనసుల్ని గెలుచుకునేందుకు ప్రత్యేక వ్యూహాల్ని సిద్ధం చేయటం ఇప్పుడో అలవాటుగా మారింది.

ఇప్పటికే తెలంగాణ అధికార పక్షం టీఆర్ ఎస్ కు షాకిచ్చే ఆపరేషన్ ను షురూ చేసిన బీజేపీ.. ఏపీలో కూడా అదే విధానాన్ని అమలు చేయనుందా? అంటే అవునని చెబుతున్నారు. అవసరం కోసం అరువు తెచ్చుకున్న బాబు పార్టీ నేతలపై కమలనాథులు కన్నేసినట్లుగా చెబుతున్నారు. ఊహించని రీతిలో దారుణ ఓటమితో ఏపీలో బాబు పరిస్థితి గడ్డుగా మారిపోవటమే కాదు.. సమీప భవిష్యత్తులో బాబు కోలుకుంటారో లేదో అన్న సందేహం కలిగేలా ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని చెప్పాలి. ఇలాంటివేళ.. టీడీపీలో కొనసాగటానికి మించిన తెలివితక్కువ పని మరొకటి ఉండదన్నట్లుగా నేతల తీరు ఉంది.

ఇప్పటికే తెలంగాణలో పార్టీని మూసివేసే పరిస్థితి రాగా.. ఏపీలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ అన్నదే ఉండకూడదన్నట్లుగా వ్యవహరించి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీలోకి లాగేసుకొని.. పదవులు కట్టబెట్టేసే నేతలంతా.. పార్టీకి పవర్ పోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉండరన్న సత్యం మరోసారి బాబుకు అర్థమయ్యే పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కడప జిల్లాలో కీలక నేతగా.. ప్రజాదరణ మెండుగా ఉందన్న పేరున్న మాజీ మంత్రి.. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తాజాగా బీజేపీలోకి చేరే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఆయన రహస్యంగా బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డా తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది.

ఆదిని బీజేపీలోకి రావాల్సిందిగా నడ్డా ఆహ్వానించారని.. ఆయన ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తారని చెబుతున్నారు. నిజానికి ఆదికి బీజేపీలోకి వెళ్లే ఉద్దేశమే లేనిపక్షంలో నడ్డాతో సమావేశమయ్యే అవకాశమే లేదు. నిజానికి ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లుగా కడప జిల్లా రాజకీయాల్లో ప్రత్యర్థులైన ఆది.. రామసుబ్బారెడ్డిలు ఒకే పార్టీలో కొనసాగటం.. వారిద్దరూ కలిసిపోయిన నేపథ్యంలో కడప జిల్లాలో టీడీపీ సంచలన విజయాన్ని సాధిస్తుందన్న లెక్కలు వేసుకున్నా.. ఎన్నికల వేళ.. జగన్ పార్టీకి భారీ ఎత్తున మెజార్టీ రావటం చూస్తే.. టీడీపీ మీద ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఎంతన్న విషయం అర్థమవుతుంది.

ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఆదికి అటు క్యాడర్ తో పాటు.. మరిన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆయన బీజేపీలోకి చేరాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. మోడీ బిగ్ బాస్ గా ఉన్న బీజేపీకి రానున్న రోజుల్లో తిరుగు ఉండదని.. అందుకే బీజేపీలో చేరితే.. ఫ్యూచర్ బాగుంటుందన్న ఆలోచనలో ఆది ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు వ్యక్తమవుతున్న అంచనాలు నిజమై.. ఆది కానీ బీజేపీలోకి చేరితే మాత్రం చంద్రబాబుకు భారీ షాక్ గా చెప్పక తప్పదు. పార్టీని నమ్ముకున్న వారి కంటే ఆది లాంటి అద్దెకు వచ్చిన నేతలకు పెద్ద పీట వేసిన బాబుకు ఇలాంటి ఎదురుదెబ్బలు తగలాల్సిందేనన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.