Begin typing your search above and press return to search.

ఆ సీనియ‌ర్ ఐఏఎస్ వైసీపీలోకి వ‌చ్చేస్తార‌ట‌

By:  Tupaki Desk   |   15 April 2018 9:20 AM GMT
ఆ సీనియ‌ర్ ఐఏఎస్ వైసీపీలోకి వ‌చ్చేస్తార‌ట‌
X
ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌కీయాలు హాట్‌ హాట్‌ గా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ...కొత్త అంచ‌నాలు - రాజ‌కీయ సమీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా ఏపీలో వినిపిస్తున్న కొత్త చ‌ర్చ‌...రిటైర్డ్ ఐఏఎస్ - ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ‌య్ క‌ల్లం రాజ‌కీయ అరంగేట్రం. ఐఏఎస్ అధికారిగా సీఎస్ స‌హా అనేక కీల‌క బాధ్య‌త‌ల్లో ప‌నిచేసిన అజయ్ త్వ‌ర‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నట్లు విశ్లేష‌కులు జోస్యం చెప్తున్నారు. ఇందుకు ఇటీవ‌ల ఆయ‌న చేసిన కామెంట్ల‌ను ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంటున్నారు.

ఇటీవ‌ల అజ‌య్‌ క‌ల్లం మీడియాతో మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగకపోగా - పాలకుల అవినీతి చాలా పెరిగిపోయిందని - దీని వల్ల వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముందని హెచ్చ‌రించడం క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మహానగరాల నిర్మాణం అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా ఉందని అజ‌య్ క‌ల్లం ఆరోపించారు. అనుభ‌వజ్ఞుల పాలన అంటే పెద్ద నగరాలు కట్టడమే కాదని, గ్రామాలను అభివృద్ధి చేయడం కూడా అని రాజధాని పేరుతో దుబారా చేస్తున్నారనిఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ఏపీలో కొత్త రాజధాని కట్టాలనుకునేది కేవలం పైరవీల కోసం మాత్రమేనని ఆరోపించారు. ఏపీలోని ప‌రిణామాల‌పై తాను పుస్త‌కం రాసిన‌ట్లు అజ‌య్‌ వెల్ల‌డించారు. దీంతో పాటుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ మేక‌ప్ వేసుకొని వ‌చ్చే వారిప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. ఎవ‌రో రాసిన స్క్రిప్ట్ కంటే నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండి, వారి స‌మ‌స్య‌ల ప‌ట్ల ఎల్ల‌వేళ‌లా స్పందించే నాయ‌కులే మేల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌ల‌ను ప‌లువురు విశ్లేషిస్తూ అజ‌య్ క‌ల్లం పొలిటిక‌ల్ ఎంట్రీ కోసం రంగం సిద్ధం చేసుకున్నార‌ని, అందులో భాగ‌మే ఈ వ్యాఖ్య‌ల‌ని అంటున్నారు. కొద్దికాల క్రితం వ‌ర‌కు ఎలాంటి కామెంట్లు చేయ‌ని క‌ల్లం తాజాగా రాజ‌ధానిపై స్పందించ‌డం, అవినీతిపై గ‌ళం విప్ప‌డం - నిజ‌మైన ప్ర‌జా నాయ‌కులు వ్య‌వ‌హ‌రించే తీరు గురించి విశ్లేషించ‌డం ఆయ‌న త‌దుప‌రి మ‌జిలీని తెలియ‌జెప్తుంద‌ని వివరిస్తున్నారు. అజ‌య్ క‌ల్లం చేసిన వ్యాఖ్య‌లు దాదాపుగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ ను పోలి ఉన్నాయ‌ని అంటున్నారు. త్వ‌ర‌లో క‌ల్లం వైసీపీలో చేర‌డం ఖాయ‌మంటున్నారు. ఈ అంచ‌నాల్లో నిజం సంగ‌తి తేలాలంటే..మ‌రికొద్ది కాలం ఆగాల్సిందే.