Begin typing your search above and press return to search.

రజినీ తో పొత్తు పై క్లారిటీ ఇచ్చిన బీజేపీ మాజీ కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   2 March 2020 2:30 PM IST
రజినీ తో పొత్తు పై క్లారిటీ ఇచ్చిన బీజేపీ మాజీ కేంద్రమంత్రి
X
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి గత కొన్ని రోజులుగా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో వరుసగా అభిమానులతో సమావేశాలు నిర్వహించిన రజినీ ..పార్టీ పేరుని అనౌన్స్ చేసే సమయంలో మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ రజినీ రాజకీయ ప్రవేశం ఖాయం అంటూ హింట్ ఇచ్చిన నేపథ్యంలో అయన పార్టీ పేరు ఏంటి? అలాగే పార్టీ సిద్దాంతాలు ఏవి? అనేదాని పై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అలాగే రజినీ ఏ పార్టీ తో పొత్తు పెట్టుకోబోతున్నారు అనే చర్చలు కూడా నడుస్తున్నాయి.

పార్టీ కే దిక్కులేదు అంటే పొత్తు వరకు వెళ్లిపోయారు కొందరు. అయితే , వచ్చే ఏడాది తమిళనాడు లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆలోపు పార్టీ పెట్టి ..ఆ ఎన్నికలలో పోటీ చేయాలనే ఆలోచనలో రజినీ ఉన్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే అయితే మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, రజనీకాంత్‌ చిరకాల మిత్రుడు కమలహాసన్‌ రజినీ తో పొత్తు పెట్టుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే , మరోవైపు రజినీ బీజేపీ మద్దతుదారుడనే ముద్ర ఉంది.

ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ కేంద్ర సహాయమంత్రి పోన్‌ రాధాకృష్ణన్‌ ఆదివారం చెన్నై విమానాశ్రమం లో మీడియా తో మాట్లాడుతూ ...ఈ విషయం పై స్పందించారు. పౌరసత్వ బిల్లు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన సంచలన వ్యాఖ్యల పై స్పందిస్తూ.. పౌరసత్వ బిల్లు వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి శాసనసభలో తెలిపారని, అయితే , పదే పదే ఈ విషయం పై మీడియా అడగడంతో అవసరం అయితే ఆ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసే విషయమై పరిశీలిస్తామని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పి ఉండ వచ్చునని చెప్పారు.

ఇక రజనీకాంత్‌ తో బీజేపీ పొత్తు పై స్పందించమని అడగ్గా .. అసలు ఫస్ట్ రజనీకాంత్‌ ను పార్టీ పెట్టి , ఆయన పార్టీ జెండా, అజెండా ఏమిటో వెల్లడించాలని, ఆ తరువాత రజనీతో పొత్తు గురించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇక నటుడు కమలహాసన్‌ గురించి మాట్లాడుతూ... ఆయన ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఇది సినిమాను నిర్మించడం కాదని, తమిళనాడు కు సంబంధించిన ముఖ్యమైన అంశం అని అన్నారు.

ఇకపోతే , దేశంలో ప్రస్తుతం ఆందోళనలకు దారితీస్తున్న ..సీఏఏ ద్వారా ముస్లింలకు ఎలాంటి బాధ ఉండదని, అలా ఏదైనా ఉంటే ముందుగా తానే వ్యతిరేకిస్తానని రజనీకాంత్‌ చెప్పిన విషయం తెలిసిందే. దీనితో పలువురు ముస్లిం మత పెద్దలు పోయెస్‌గార్డెన్‌ లోని ఆయన ఇంటికీ వెళ్లి కలుస్తున్నారు. సీఏఏ ద్వారా ముస్లిం లకి ఎటువంటి నష్టం జరగదు అని రజినీ చెప్పడం , ఏదైనా జరిగితే మీ ముందు నేను ఉండి పోరాడతా అని చెప్పడంతో ..ముస్లిం మత పెద్దలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. అయితే , మత పెద్దలు రజనీని కలవడం ఇప్పుడు మరో చర్చకు దారి తీస్తోంది.