Begin typing your search above and press return to search.

ఏం చేసినా సీబీఐ మాజీ జేడీ రూటే స‌ప‌రేటు!

By:  Tupaki Desk   |   16 Aug 2022 11:02 AM GMT
ఏం చేసినా సీబీఐ మాజీ జేడీ రూటే స‌ప‌రేటు!
X
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ గురించి తెలియ‌నివారు లేరు. ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల‌ను విచారించింది లక్ష్మీనారాయ‌ణే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు.

కాగా ఎన్నో ఏళ్ల స‌ర్వీసు ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న స్వ‌చ్ఛంధ ప‌ద‌వీ విర‌మ‌ణ (వీఆర్ఎస్) తీసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలో జ‌న‌సేన పార్టీలో చేరారు. విశాఖ‌ప‌ట్నం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

అయిన‌ప్ప‌టికీ జ‌న‌సేన పార్టీలోనే క్రియాశీల‌కంగా కొన‌సాగారు. అయితే ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన ల‌క్ష్మీ నారాయ‌ణ జ‌న‌సేన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ త‌ర్వాత ఆయ‌న టీడీపీలో, బీజేపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌చ్చినా చేర‌లేదు.

కాగా ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ వ్య‌వ‌సాయంపై దృష్టిపెట్టారు. తూర్పుగోదావ‌రి జిల్లా (ప్ర‌స్తుతం కాకినాడ జిల్లా) ప్ర‌త్తిపాడు మండ‌లం ధ‌ర్మ‌వ‌రం, రాచ‌ప‌ల్లి గ్రామాల్లో 12 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమిని కౌలుకు తీసుకున్నారు.

ఈ 12 ఎక‌రాల్లో ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో ఆయ‌న వ‌రి పండించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తాను కౌలుకు తీసుకున్న భూమిలో స్వ‌యంగా వరి నాట్లు వేశారు. వ్య‌వ‌సాయ కూలీల‌తో క‌లిసి వ‌రినాట్లు వేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అభిమానులు, స్థానిక రైతులు కూడా ఉత్సాహంగా పాల్గొని వ‌రినాట్లు వేయ‌డం విశేషం. ఒక‌ప్పుడు స‌మ‌ర్థుడు, నిజాయ‌తీపరుడైన ఐపీఎస్ అధికారిగా పేరు పొందారు.. జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఇప్పుడు పూర్తి స్థాయి రైతుగానూ ఆయ‌న సంచ‌ల‌నాలు సృష్టించే దిశ‌గా సాగిపోతున్నారు.