Begin typing your search above and press return to search.

కుప్పం నుంచి చిన‌బాబు.. మ‌రి చంద్ర‌బాబు?

By:  Tupaki Desk   |   16 July 2021 6:30 AM GMT
కుప్పం నుంచి చిన‌బాబు.. మ‌రి చంద్ర‌బాబు?
X
మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ భ‌విష్య‌త్తే అయోమ‌యంలో ప‌డింది. అటు తెలంగాణ‌లో టీడీపీ ప‌డ‌వ మునిగిపోయింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌ల్లో చావు దెబ్బ తిన్న బాబు 2024 ఎన్నిక‌ల్లో తిరిగి గెల‌వ‌క‌పోతే ఆయ‌న పార్టీ క‌నుమ‌ర‌గ‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

చంద్ర‌బాబే ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంటే ఇప్ప‌డు ఆయ‌న త‌న‌యుడు, మాజీ మంత్రి లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్ గురించి ఆస‌క్తిక‌ర వార్త వినిపిస్తోంది. చిన‌బాబు కోసం చంద్ర‌బాబు త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన కుప్పంను త్యాగం చేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ లోకేష్‌ను నిల‌బెడ‌తార‌ని ఆ వార్త సారాంశం.

తండ్రి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు ఎమ్మెల్సీ ద్వారా లోకేష్ మంత్రి అయ్యారు. కానీ 2019 ఎన్నిక‌ల్లో తండ్రితో క‌లిసి అసెంబ్లీ గ‌డ‌ప తొక్కాల‌నుకున్న ఆయ‌న ఆశ‌లు మాత్రం తీర‌లేదు. మంగ‌ళ‌గిరిలో ఆయ‌న చిత్తుగా ఓడిపోయారు. అలా అక్క‌డి ప్ర‌జ‌ల తిర‌స్కారానికి గురైన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఓ నియోజ‌క‌వ‌ర్గాన్ని వెతుకుతున్న‌ట్లు తెలిసింది.

త‌న‌కు విజ‌యావ‌కాశాలు ఉండే నియోజ‌క‌వ‌ర్గంపైనే దృష్టి పెడుతున్న‌ట్లు స‌మాచారం. ఓ ద‌శ‌లో త‌న సొంత‌మామ బాల‌కృష్ణ‌ నియోజ‌క‌వ‌ర్గం హిందూపురం వెళ్లాల‌ని ప‌న్నాగం ప‌న్నినా అది క‌లిసి రాలేదు. దీంతో ఇప్పుడు త‌న తండ్రి నియోజ‌క‌వ‌ర్గంపై లోకేష్ దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఎన్ని ర‌కాలుగా చూసినా లోకేష్‌కు స‌రైన నియోజ‌క‌వ‌ర్గం దొర‌క‌ద‌ని తేలిపోయింది. కార్య‌క‌ర్త‌లు క‌దిలొచ్చినా, నాయ‌కులు త్యాగం చేసినా ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో చిన‌బాబు గెలుపు క‌ష్ట‌మేన‌న్న అభిప్రాయం ఉంది. మ‌రోవైపు క‌చ్చితంగా గెలిచే నియోజ‌క‌వ‌ర్గాల‌ను టీడీపీ ఎమ్మెల్యేలు వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేరు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు కుప్పం త‌ప్పించి మ‌రో ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని లోకేష్‌కు వ‌దిలేస్తే చంద్ర‌బాబు కొత్త నియోజ‌క‌వ‌ర్గాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. బాబుకు అది క‌ష్ట‌మైన ప‌ని కాన‌ప్ప‌టికీ ఈ వ‌య‌సులో కొత్త నియోజ‌క‌వ‌ర్గంలో పోటీకి దిగేలా అక్క‌డి నేత‌ల‌ను ఒప్పించ‌డం ఆయ‌న‌కు త‌ల‌కు మించిన భారంగా మార‌నుంది.

ఒక‌వేళ లోకేష్‌ను కుప్పం బ‌రిలో నిలిపినా ఆయ‌న గెలుస్తారా అంటే క‌చ్చితంగా అవున‌ని చెప్పే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే అక్క‌డ జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లోనే ఆయ‌న ముందే కార్య‌క‌ర్త‌లు జై ఎన్టీఆర్ అనే నినాదాలు చేయ‌డం తెలిసిందే.

మ‌రోవైపు కుప్పంలో అభివృద్ధి ప‌నులు, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల మెప్పు పొందేందుకు అధికార పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ ప‌రిస్థితుల మ‌ధ్య‌లో లోకేష్ గెలుపు క‌ష్ట‌మేన‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఆయ‌న ఎక్క‌డ నుంచి బ‌రిలో దిగుతారు? గెలుస్తారా? లేదా అనేది తేలాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ ఆగాల్సిందే.