Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ ఐపీఎస్ ఘాటు లేఖ‌.. స‌ర్కారుకు మ‌ళ్లీ తిప్ప‌లేనా?

By:  Tupaki Desk   |   25 March 2022 10:41 AM GMT
సీనియ‌ర్ ఐపీఎస్ ఘాటు లేఖ‌.. స‌ర్కారుకు మ‌ళ్లీ తిప్ప‌లేనా?
X
ఔను! ఇప్పుడు ఇదే చ‌ర్చ ఏపీ అధికార‌వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ ఇంటిలిజె న్స్ చీఫ్‌గా ప‌నిచేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును జ‌గ‌న్ స‌ర్కారు.. స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆయ న కుమారుడు.. స్థాపించిన కంపెనీ ద్వారా.. వెంక‌టేశ్వ‌ర‌రావు.. అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డారని పేర్కొంటూ.. ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ విధించింది. ఇది అనేక మ‌లుపులు తిరిగింది. హైకోర్టుకు కూడా వెళ్లింది. చివ‌ర‌కు సుప్రీం కోర్టుకు కూడా చేరింది. ప్ర‌స్తుతం ఆయ‌న స‌స్పెన్ష‌న్‌లోనే ఉన్నారు. అయితే.. తాజాగా ఏబీ ప్ర‌భుత్వానికి లేఖ సంధించారు.

త‌న‌ను ఇక‌, స‌స్పెన్ష‌న్ లో ఉంచే హ‌క్కు, అధికారం ప్ర‌బుత్వానికి లేద‌ని.. ఆయ‌న తెగేసి చెప్పారు. ఈ మేరకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. స‌మీర్‌శ‌ర్మ‌కు ఏవీ వెంక‌టేశ్వ‌ర‌రావు లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అవినీతి ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న స‌స్పెన్ష‌న్‌కు గురైన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన మొద‌లుకుని దాదాపు ఆయ‌న స‌స్పెన్ష‌న్‌లోనే ఉన్నారు. ఈ క్ర‌మంలో త‌న రెండేళ్ల స‌స్పెన్ష‌న్ గ‌డువు ముగిసింద‌ని, ఇక దాన్ని కొన‌సాగించే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేద‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి8తో రెండేళ్ల స‌స్పెన్ష‌న్ గ‌డువు పూర్త‌యింద‌ని ఆయ‌న తెలిపారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం రెండేళ్ల‌కు మించి స‌స్పెన్ష‌న్ కొన‌సాగించాలంటే..కేంద్ర హోంశాఖ అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి అని ఆయ‌న పేర్కొన్నారు. గ‌డువులోపు రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర అనుమ‌తి తీసుకోలేద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

గ‌త ఏడాది జూలై 31న చివ‌రి సారిగా త‌న స‌స్పెన్ష‌న్‌ను పొడిగిస్తూ ఇచ్చిన జీవోను ర‌హ‌స్యంగా ఉంచార‌ని ఆయ‌న ఆరోపించారు. త‌న‌కు కాపీ కూడా ఇవ్వ‌లేద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ ఫిబ్రవ‌రి 8వ తేదీతో స‌స్పెన్ష‌న్ గ‌డువు ముగిసిన నేప‌థ్యంలో పూర్తి జీతం వెంట‌నే ఇవ్వాల‌ని కోరుతూ ఆయ‌న సీఎస్‌కు లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అదేస‌మ‌యంలో త‌న‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని.. ఆయ‌న ప‌రోక్షంగా కోరిన‌ట్టు అయింది. ఎందుకంటే.. పూర్తి జీతం కోరుతున్నారంటే.. ప‌నిచేయాల్సిందే క‌దా! అంతేకాదు.. ప్ర‌భుత్వం త‌న స‌స్పెన్ష‌న్ కు సంబందించి తీసుకున్న నిర్ణ‌యాన్ని ఆయ‌న హైకోర్టులో స‌వాల్ చేయ‌గా.. దీనిని ఎత్తేయాల‌ని.. హైకోర్టు ఆదేశించింద‌ని..అయినా కూడా ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంద‌న్నారు.

ఈ నేప‌థ్యంలో అన్ని గ‌డువులు తీరిపోయాయి క‌నుక‌.. త‌న‌ను విధుల్లోకి తీసుకుని..పూర్తి జీతం ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు స‌గం జీతం అంటే.. సుమారు.. లక్ష‌న్న‌ర నెల‌నెలా ప్ర‌భుత్వం ఇస్తోంది. కాగా, ప్ర‌భుత్వం క‌నుక స్పందించ‌ని .. ప‌క్షంలో మ‌రోసారి ఏబీవీ హైకోర్టుకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ప్ర‌భుత్వం మ‌రోసారి కోర్టులోనే తేల్చుకుంటుందా.. లేక‌..ఏబీవీని విధుల్లోకి తీసుకుంటుందా? అనేది చూడాలి.