Begin typing your search above and press return to search.

బాలీవుడ్ నటిని పొగడ్తలతో ముంచెత్తిన మాజీ ముఖ్యమంత్రి

By:  Tupaki Desk   |   20 Aug 2019 5:34 AM GMT
బాలీవుడ్ నటిని పొగడ్తలతో ముంచెత్తిన మాజీ ముఖ్యమంత్రి
X
కాలానికి తగ్గట్లు.. ప్రజల మైండ్ సెట్ కు అనుగుణంగా.. ట్రెండ్ ను ఫాలో అవుతూ తీసుకునే నిర్ణయాలన్ని తెలివైనవిగా మారటమేకాదు.. బోలెడంత పేరు ప్రఖ్యాతుల్ని సొంతమయ్యేలా చేస్తాయి. తాజాగా ఈ విషయం బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు బాగానే అర్థమై ఉంటుంది. ఒక ఆయుర్వేద కంపెనీ తాను తయారు చేసిన స్లిమ్ పిల్స్ కు ప్రచారకర్తగా ఉండాలని శిల్పాను అడిగారు. తమ మాత్రల్ని వాడితే సన్నగా మారిపోతారన్న విషయాన్ని ప్రచారం చేయాలని కోరటమే కాదు.. ఆ డీల్ కు ఓకే చెబితే ఏకంగా రూ.10కోట్లు రెమ్యునరేషన్ ఇస్తామని భారీ ఆఫర్ ఇచ్చింది.

చేతిలో సినిమాలేమీ లేకున్నా.. తనకొచ్చిన భారీ ఆఫర్ ను లైట్ తీసుకుంటూ నో చెప్పేసింది. అంతేకాదు.. నమ్మకం లేని ఉత్పత్తులను తాను ప్రచారం చేయనని సోషల్ మీడియాలో వెల్లడించింది. తన మనస్సాక్షికి నచ్చని పని చేయనని చెప్పిన ఆమె.. తాను నమ్మని విషయాల్ని ఇతరులకు చెప్పలేనని పేర్కొంది. రూ.10 కోట్ల ఆఫర్ ను సింఫుల్ గా నో చెప్పేసిన వైనం వైరల్ గా మారటమే కాదు.. ఆమె మీద అభిమానం పొంగిపొర్లేలా చేసింది.

సోషల్ మీడియాలో ఆమె తీసుకున్న నిర్ణయానికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె బాటలోనే నడవాలంటూ పలువురు సెలబ్రిటీలకు సూచనలు ఇస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. శిల్ప తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైందని మెచ్చుకున్నారు.

అవాస్తవమైన ప్రచారాలకు సెలబ్రిటీలు దూరంగా ఉండాలని తాను కోరుతున్నానని.. కంపెనీల అమ్మకాలు పెంచటానికి సెలబ్రిటీలు వాటి తరఫున ప్రచారం చేయొద్దన్నారు. సెలబ్రిటీలు తీసుకునే నిర్ణయాలు సమాజానికి సాయం చేస్తాయన్నారు. మొత్తానికి రూ.10 కోట్ల డీల్ రిజెక్ట్ చేస్తే చేసింది కానీ.. అంతకు పది రెట్లు ప్రయోజనం కలిగేలా భారీ ఇమేజ్ ను శిల్పా సొంతం చేసుకున్నారని చెప్పక తప్పదు.