Begin typing your search above and press return to search.

నాడు క్రికెటర్.. నేడు చైన్ స్నాచర్..?

By:  Tupaki Desk   |   18 Oct 2015 5:40 AM GMT
నాడు క్రికెటర్.. నేడు చైన్ స్నాచర్..?
X
క్రికెటర్ అన్న వెంటనే విపరీతమైన క్రేజ్ తో పాటు.. పేరు ప్రఖ్యాతులు.. డబ్బు లాంటి వాటికి కొదవలేదన్నట్లుగా భావిస్తుంటారు. కానీ.. అందరూ అలా ఉండరని.. కొందరి ఉదంతాలు వింటే వామ్మో అనిపించక మానదు. క్రికెటర్ గా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని.. ఇప్పుడు దొంగగా అవతారం ఎత్తిన ఉదంతం ఇది. సంచలనం రేకెత్తించటమే కాదు.. కెరీర్ ను సరిగా ప్లాన్ చేసుకోకపోవటం.. తప్పుదారి పడితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయనటానికి ఈ క్రికెటరే పెద్ద ఉదాహరణ.

మధ్యప్రదేశ్ అండర్ 19 జట్టులో క్రికెటర్ ముర్తజా ఆలీ ఆడేవాడు. కానీ.. అతగాడి ఆట మెరుగుకాకపోవటంతో ముందుకు వెళ్లలేకపోయాడు. తనకొచ్చిన అవకాశాలతో మంచి మార్గాన నడవాల్సింది పోయిన అతగాడు చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. చివరకు నేరాలను వృత్తిగా ఎంచుకోవటమే కాదు.. ఒక గ్యాంగ్ ను తయారు చేశాడు.

గ్యాంగ్ లీడర్ గా ఉంటూ చైన్ స్నాచింగ్ లు చేయటం కోసం పెద్ద బ్యాచ్ నే మొయింటైన్చేస్తున్నాడు. 30ఏళ్ల ఆలీని అతని గ్యాంగ్ లోని మరికొందరు నేరస్తుల్ని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 75 నేరాల్లో ఈ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. నాలుగు బైక్ లు.. పది బంగారు చైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతగాడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ కు పంపుతూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చెడు మార్గాన పయనించే వాడు ఏదో ఒక రోజున పట్టుబడక తప్పదు.