Begin typing your search above and press return to search.

బాబుకు కొత్త‌గా బీపీ పెంచుతున్న ఐవైఆర్‌

By:  Tupaki Desk   |   14 Aug 2017 3:39 PM GMT
బాబుకు కొత్త‌గా బీపీ పెంచుతున్న ఐవైఆర్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కొత్త రీతిలో ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం - ప‌రిపాల‌న‌ను టార్గెట్ చేసిన కృష్ణారావు తాజాగా అభివృద్ధి మంత్రం - ప్రాంతీయ వైరుధ్యాల ఎజెండాను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన ‘రాయలసీమ అభివృద్ధి- సవాళ్లు’ అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం, శివరామక్రిష్ణన్ నివేదికల స్ఫూర్తికి భిన్నంగా అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో తప్పకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ - చత్తీస్‌ ఘడ్ - కేరళ - మధ్యప్రదేశ్ - ఒరిస్సా - రాజస్థాన్ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రాజధానులు - హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. కావున రాయలసీమలో తప్పకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేశారు.

అమరావతి రాజధాని కోసం 10 వేల ఎకరాల అటవీ భూములు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, ఈ భూములకు ప్రత్యామ్నాయంగా రాయలసీమలోని కడప, అనంతపురం జిల్లాలను పేర్కొనటాన్ని ఐవైఆర్‌ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం కృషి చేయాలని, చెరువుల స్థిరీకరణపై దృష్టి పెట్టాలన్నారు. గత 20ఏళ్లలో పదేళ్ల పాటు అనంతపురంలోని అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ బహుళ పంటలు పండే భూములను ధ్వంసం చేసి రాజధాని నిర్మించడం న్యాయం కాదన్నారు. రాష్ట్ర విభజన వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాలు, హైదరాబాద్ మాత్రమే బాగుపడ్డాయని, రాయలసీమకు ఎలాంటి ఫలితాలు అందలేదన్నారు. రాజధాని అమరావతిలో సాధ్యం కాదని, దొనకొండలో పెట్టాలని కోరారు. మార్కెట్ ఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. రాయలసీమలో వరిసాగును తగ్గించి ఖర్జూరం - ఎర్రచందనం - శ్రీగంధం - కూరగాయలు - దానిమ్మ తోటలను అభివృద్ధి పరచాలని, టమోటా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలను స్కిల్ డెవలప్‌ మెంట్ సెంటర్స్‌ గా మార్చి విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించాలన్నారు. కడప - కర్నూలు జిల్లాల్లో తమకు ఓట్లు రాలేదని ఈ రెండు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపన - అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడం లేదన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో 1.7 కోట్ల ఎకరాల భూమి వుండగా 10 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి వసతి ఉందన్నారు.