Begin typing your search above and press return to search.

సిద్ధాంతాల‌ను వ‌దిలేసిన బీజేపీ.. గోవా మాజీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   17 Dec 2021 7:31 AM GMT
సిద్ధాంతాల‌ను వ‌దిలేసిన బీజేపీ.. గోవా మాజీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
మ‌రికొన్ని మాసాల్లోనే గోవాలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఇక్క‌డ ఎలాగైనా మ‌రోసారి గెలిచి తీరాల‌నే ప‌ట్టుతో.. బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. గ‌తంలో మ‌నోహ‌ర్ పారీక‌ర్‌.. ఇక్క‌డ బీజేపీని నిల‌బెట్టా రు. నైతిక‌త‌కు పెద్ద‌పీట వేస్తూ.. ఆయ‌న ఇక్క‌డ బీజేపీకి పునాదులు వేశారు. అయితే..ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత‌.. బీజేపీకి ఇక్క‌డ ద‌శ దిశ అంటూ.. ఏమీ లేకుండా పోయాయ‌నే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపిస్తున్నా యి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అస‌లు గెలుస్తుందా? లేదా? అనే సందేహాలు సైతం అలుముకున్నాయి.

తాజాగా గోవాలో బీజేపీకి భారీ షాకే త‌గిలింది. అది కూడా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల ముంగిట పెద్ద కుదుపే వ‌చ్చిన‌ట్టు అయింది. మాజీ మహిళా మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే అలినా సల్ద‌న్హా.. బీజేపీపై సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ``బీజేపీ త‌న సిద్ధాంతాల‌కు తిలోద‌కాలిచ్చింది`` అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పార్టీలోకి కొత్త‌గా ఎవ‌రు వ‌స్తారో.. ఎందుకు వ‌స్తారో.. ఎప్పుడు.. వ‌స్తారో.. కూడా తెలియ‌ని దౌర్భాగ్య ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అన్నారు.

అదేస‌మ‌యంలో పార్టీ నుంచి ఎవ‌రు ఎందుకు బ‌య‌ట‌కు వెళ్తారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. ప్ర‌స్తుతం బీజేపీ ప‌రిస్తితి గోవాలో ఒక పిచ్చాసుప‌త్రిని త‌ల‌పిస్తోంద‌ని.. నిప్పులు చెరిగారు. పార్టీకి తాను రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన అలినా.. ఏ పార్టీలో చేరేదీ ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. అయితే.. ఆమెకు కాంగ్రెస్ నుంచి ఆఫర్ వ‌చ్చింద‌ని.. అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే బీజేపీని వ‌దిలేశార‌ని చెబుతున్నారు.

40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో.. గ‌త ఎన్నిక‌ల్లో అతి క‌ష్టంమీద బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. అయితే.. అప్ప‌ట్లో పార్టీని పారీక‌ర్ ముందుండి న‌డిపించారు. ఆయ‌న‌కు ఉన్న పేరు, సానుభూతి.. ఇప్పుడు ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు. అప్ప‌ట్లో ఆయ‌న ముఖం చూసి.. బీజేపీకి ఓట్లేశార‌నే పేరు కూడా వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో.. రోజుకొక వివాదం తెర‌మీదికి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ఈ ప‌రిస్థితిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకుప్ర‌య‌త్నిస్తుండ‌డం గ‌మనార్హం. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.