Begin typing your search above and press return to search.

దేశ చరిత్రలో తొలిసారి అలాంటి అరెస్ట్

By:  Tupaki Desk   |   10 Dec 2016 4:49 AM GMT
దేశ చరిత్రలో తొలిసారి అలాంటి అరెస్ట్
X
వైమానిక దళ ప్రధానాధికారి పదవి అంటే మాటలు కాదు. దేశంలోనే అత్యున్నత ఉన్నత ఉద్యోగాల్లో దీన్నొకటిగా అభివర్ణిస్తారు. అలాంటి స్థానంలో పని చేసిన ఉద్యోగిని అరెస్ట్ చేయటానికి మించిన సంచలనం ఇంకేం ఉంటుంది. మాజీ వైమానిక దళ ప్రధానాధికారిగా పని చేసిన ఎస్పీ త్యాగిని సీబీఐ తాజాగా అరెస్ట్ చేసింది. ఈ స్థాయిలో పని చేసిన అధికారిని అరెస్ట్ చేయటాని దేశ చరిత్రలోనే తొలిసారి.

71 ఏళ్ల త్యాగితో పాటు ఆయన సోదరుడు కమ్ ఢిల్లీ న్యాయవాది గౌతమ్ ఖైతాన్ ను కూడా అరెస్ట్ చేశారు. దేశంలోని వీవీఐపీలు వినియోగించేందుకు వీలుగా 12 హెలికాఫ్టర్లను కొనుగోలు చేయాలని 2003లో వాజ్ పేయ్ సర్కారు నిర్ణయిస్తే..2005లో యూపీఏ హయాంలో కొనుగోలు జరిపారు. అయితే.. ఈ కొనుగోళ్ల సమయంలో చేసిన చిన్న మార్పులతో దాదాపుగా రూ.450 కోట్ల ముడుపులు చేతులు మారినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.

రూ.3767 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో సుమారు 12 శాతం ముడపులు చేతులు మారటం.. కొనుగోలు ఒప్పంద సమయంలో చేసిన మార్పుల కారణంగా అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీకి ప్రయోజనకరంగా ఉండటమే కాదు.. ఆ విమానాలు కొనాల్సిన అవసరం ఏర్పడిందని చెబుతారు. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో తమ చాపర్లను అమ్మేందుకు వీలుగా అగస్టా అనుబంధ సంస్థ ఫిన్ మెకానికా పెద్ద ఎత్తున ముడుపుల్ని ముట్ట జెప్పిందని.. ఖాతాల నిర్వహణకు ఆక్రమాలకు పాల్పడిందన్నవిషయాన్ని నిర్దారించారు.

ఈ నేపథ్యంలో ఇందుకు బాధ్యులైన వారిని విచారిస్తున్న సీబీఐ తాజాగా.. ఎస్పీ త్యాగిని.. ఆయన సోదరుడ్ని విచారణకు పిలిచి.. విచారించి అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు గంటల పాటు సాగిన విచారణ అనంతరం.. వారిపై పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. వారిని ఈ రోజు (శనివారం) కోర్టు ముందు హాజరు పర్చనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంలో కాంగ్రెస్అధినేత్రి సోనియాగాంధీకి.. సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కు ముడుపులు అందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒప్పందంలో అవినీతి జరిగినట్లుగా నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సైతం నిర్థారించటం గమనార్హం. ఫైటర్ జెట్లను నడపటంలో మంచి పేరున్న త్యాగి.. చివరకు కాసుల కక్కుర్తితో చెరుపుకోలేని మచ్చను మీదేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది.