Begin typing your search above and press return to search.

ఈ పెద్దాయ‌నే..క‌శ్మీర్ పంచాయ‌తీలో క్లారిటీ ఇచ్చేది

By:  Tupaki Desk   |   24 Oct 2017 5:26 AM GMT
ఈ పెద్దాయ‌నే..క‌శ్మీర్ పంచాయ‌తీలో క్లారిటీ ఇచ్చేది
X
స‌రిహ‌ద్దు రాష్ట్రంగా ఉండి సంక్షోభాలకు....స‌మ‌స్య‌ల‌కు నిల‌యంగా మారిన జమ్ముకాశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. జమ్ముకాశ్మీర్‌ లోని ప్రజాప్రతినిధులు - వివిధ సంస్థల నాయకులు - వివిధ వర్గాలకు చెందినవారు - ఇతరులతో చర్చించి ఒక పరిష్కార మార్గం సూచించేందుకు ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ అధ్యక్షుడు దినేశ్వర్ శర్మను ప్రత్యేక ప్రతినిధి (ఇంటల్‌ లొకుటార్)గా నియమించింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. క్యాబినెట్ హోదాతో నియమితులైన దినేశ్వర శర్మ జమ్ముకాశ్మీర్ సమస్యకు సరైన పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్రంలోని అన్ని వర్గాలవారితో చర్చించిన అనంతరం ఒక సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వంతోపాటు జమ్ముకాశ్మీర్ ప్రభుత్వానికి అందజేస్తారని రాజ్‌ నాథ్ సింగ్ చెప్పారు. హురియత్ నాయకులతో కూడా దినేశ్వర శర్మ చర్చలు జరుపుతారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ జమ్ముకాశ్మీర్ సమస్యతో సంబంధం ఉన్న వారందరితో ఆయన చర్చలు జరుపుతారు, ఎవరితో చర్చలు జరపాలి - ఎవరితో జరపకూడదనేది దినేశ్వర శర్మ నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. చర్చల విషయంలో దినేశ్వర శర్మకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వాతంత్య్రం ఇచ్చిందని రాజ్‌ నాథ్ సింగ్ చెప్పారు. జమ్ముకాశ్మీర్ సమస్యకు ఒక రాజకీయ పరిష్కారం కనుగొనాలనే లక్ష్యంతోనే ఈ మధ్యవర్తిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత ఆగస్టు పదిహేనో తేదీనాడు ఎర్రకోట పైనుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జమ్ముకాశ్మీర్ సమస్యను తిట్లు - తుపాకి గుండ్లతో కాకుండా రాష్ట్ర ప్రజలను కౌగిలించుకోవటం ద్వారా పరిష్కరించాలంటూ చేసిన సూచనను రాజ్‌ నాథ్ సింగ్ గుర్తుచేశారు. దీనేశ్వర శర్మ ఎప్పటిలోగా ఈ చర్చల ప్రక్రియను ముగించి నివేదికను అందజేయాలని ఒక విలేఖరి ప్రశ్నించగా చర్చల ప్రక్రియకు గడువు అనేదేదీ నిర్ణయించలేదు, దీనేశ్వర శర్మ జమ్ముకాశ్మీర్‌తో సంబంధం ఉన్న వారందరితో పూర్తిస్థాయిలో చర్చించి సమస్యకు పరిష్కారం సూచిస్తారని రాజ్‌ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌ డిఏ ప్రభుత్వం జమ్ముకాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని ధృడంగా ఆలోచిస్తోందన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఎన్‌ డిఏ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందని హోం శాఖ మంత్రి తెలిపారు. కాశ్మీర్‌ లో తాను నాలుగు రోజుల పాటు పర్యటించి 87 ప్రతినిధుల బృందాలతో చర్చలు జరిపి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తనను కలిసి రాష్ట్ర సమస్య గురించి చర్చించారని ఆయన తెలిపారు.

1979 బ్యాచ్ ఐపిఎస్ అధికారి శర్మకు అంతర్గత భద్రతకు సంబంధించిన పూర్తి అవగాహన ఉన్నదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. దినేశ్వర శర్మ ఐబి డైరెక్టర్‌గా ఉన్నప్పుడు జమ్ముకాశ్మీర్ సమస్యను అధ్యయనం చేశారన్నారు. జమ్ముకాశ్మీర్ ప్రజలు ముఖ్యంగా యువత ఏం కోరుకుంటున్నారనేది శర్మ అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారని హోం శాఖ మంత్రి వివరించారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు గతంలో నియమితులైన మధ్యవర్తులు ఇచ్చిన నివేదికలను అమలు చేయలేదు - అలాంటప్పుడు దినేశ్వర శర్మ సిఫారసులను అమలు చేస్తారని న‌మ్మ‌కం ఏమిటని ఒక విలేఖరి అడగ్గా తాము ఏం చేసినా చిత్తశుద్ధితో చేస్తున్నాము, సమస్యను పరిష్కరించే లక్ష్యంతోనే ఇప్పుడు మధ్యవర్తిని నియమించామని రాజ్‌ నాథ్ సింగ్ చెప్పారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు నరేంద్ర మోడీ కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో చర్చించారు, అందరూ కూడా చర్చలు జరపాలని సూచించారు, అందుకే ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నామని రాజ్‌ నాథ్ సింగ్ చెప్పారు. గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించనంత మాత్రాన తాజా ప్రయత్నం ఫలించదని చెప్పలేము కదా? అని హోం శాఖ మంత్రి అన్నారు.

కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలన్నది తమ లక్ష్యమన్నారు. కాశ్మీర్ సమస్యను అర్థం చేసుకునేందుకు ఐపిఎస్ అధికారిని నియమించే బదులు మీలాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని నియమిస్తే బాగుండేది కదా? అని ఒక విలేఖరి సూచించగా కాశ్మీర్ సమస్యను పరిష్కరించటమే మా లక్ష్యం, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని వ్యక్తి అన్ని సంస్థలు - వ్యక్తులు - రాజకీయ పార్టీలతో మాట్లాడగలుగుతారన్నది మా అభిప్రాయమని రాజ్‌ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దినేశ్వర శర్మపై ఎలాంటి ప్రతిబంధకం లేవు, ఆయన ఎవరితోనైనా మాట్లాడవచ్చునని హోం మంత్రి తెలిపారు. కొత్త గవర్నర్‌ ను నియమిస్తే బాగుంటుందని మీరు భావించటం లేదా అనే ప్రశ్నకు- `లేదు` అని ఆయన బదులిచ్చారు.