Begin typing your search above and press return to search.

జింబాబ్వే విజయ గాథ వెనుక.. భారతీయుడు

By:  Tupaki Desk   |   30 Oct 2022 12:30 AM GMT
జింబాబ్వే విజయ గాథ వెనుక.. భారతీయుడు
X
వెస్టిండీస్ సూపర్ 12 దశకు అర్హతే పొందలేకపోయింది... పాకిస్థాన్ సూపర్ 12లో గెలుపు బోణీ కొట్టలేకపోతోంది.. కానీ, సరిగ్గా ఏడాది కిందట జరిగిన టి20 ప్రపంచ కప్ నకు అర్హతే పొందలేకపోయిన ఆ జట్టు.. ఈసారి సూపర్ 12కు వచ్చింది.. రెండు విజయాలతో ముందంజలో ఉంది. వచ్చే వన్డే ప్రపంచ కప్ నకు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ జట్టే జింబాబ్వే.. దాని విజయ గాథ వెనుకున్నది మన భారతీయుడు.

ఒకప్పుడు మంచి జట్టే..

15-20 ఏళ్ల కిందటి వరకు జింబాబ్వే అంతర్జాతీయ క్రికెట్ లో బలమైన జట్టే. ఒలాంగా, హీత్‌ స్ట్రీక్‌ వంటి పేసర్లు... ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్ వంటి గొప్ప బ్యాట్స్ మన్, నీల్ జాన్సన్ లాంటి ఆల్ రౌండర్లతో జింబాబ్వే పెద్ద జట్టుగానే ఉండేది. వన్డేల్లో చాలాసార్లు సంచలనాలు రేపింది కూడా. భారత్ నూ ఓ దశలో సవాల్ చేసింది. జింబాబ్వేతో మ్యాచ్ అంటే.. కాస్త జాగ్రత్తగా ఆడాలి అనేట్లుగా ఉండేది. అయితే, పాలకుల తీరుతో ఆ దేశం సంక్షోభంలోకి జారిపోయింది. క్రికెట్ బోర్డు అస్తవ్యస్తమైంది. దీనికితోడు తెల్లవారు-నల్లవారు వివాదంతో ప్రమాణాలు మరింత దిగజారాయి. తీవ్ర దుర్భిక్షం.. కరెన్సీ విలువ పతనం.. ఆర్థిక మాంద్యంతో జింబాబ్వే ఓ సంక్షోభం దేశంగా మారిపోయింది. క్రికెటర్లు కూడా కకావికలం అయ్యారు. ఫ్లవర్ సోదరులు, స్ట్రీక్ వంటి వారు రిటైర్మెంట్ తో ఆ జట్టుకు ప్రధాన దెబ్బగా మారింది. స్ట్రీక్ వంటి వారు మార్పు కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

ఐసీసీ నిషేధాన్ని ఎదుర్కొని..

అసలే అతలాకుతలం అయిన జింబాబ్వే క్రికెట్ జట్టును.. రాజకీయ జోక్యాన్ని కారణంగా చూపుతూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆర్నెల్ల పాటు నిషేధించింది. అంతకుమందు కిందామీద పడి ప్రతి ప్రపంచకప్‌నకు అర్హత సాధించే జింబాబ్వే 2019 వన్డే ప్రపంచకప్‌ నకు దూరమైంది. అప్పటినుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఒక్కొక్క ఆటగాళ్లను ప్రోది చేసుకుంటూ ఓ జట్టుగా నిలబడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడమే కాక.. సూపర్‌-12 దశకు కూడా వచ్చింది. మూడు రోజుల కిందట మ్యాచ్ లో పాకిస్థాన్‌కు షాకిచ్చింది.

మన కోచ్.. వాళ్ల కోచ్

టీమిండియా తొలి టి20 ప్రపంచ కప్ ను గెలిచింది 2007లో. మళ్లీ ఇప్పటివరకు అది కలగానే మిగిలిపోయింది. అప్పుడు కోచ్ ఎవరో తెలుసా? లాల్ చంద్ రాజ్ పుత్. 2007 ప్రపంచ కప్ లో దారుణంగా నిష్క్రమించిన జట్టు.. ఆర్నెల్లలో సీనియర్లు లేకుండానే టి20 ప్రపంచ కప్ నెగ్గింది. దీనివెనక రాజ్ పుత్ పాత్ర కూడా ఉన్నది. ఇప్పుడు జింబాబ్వే కోచ్ కూడా ఇతడే. ఆ జట్టు ఆటను పూర్తిగా మార్చి.. పోరాట బాట పట్టించాడు. భారత మాజీ ఆటగాడు కూడా అయిన లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ 2018లో జింబాబ్వే కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. వారి ఆటలో ఎంతో మార్పు తెచ్చి గత జూన్‌లో క్రికెట్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు.

బ్యాటింగ్ లో నిలకడ.. బౌలింగ్ లో పదును

జింబాబ్వే బ్యాటింగ్‌లో నిలకడ, బౌలింగ్‌లో పదును, ఫీల్డింగ్‌లో మెరుపులు రాజ్‌పుత్‌ చలవే. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను గుర్తించి జట్టులోకి తీసుకొచ్చి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడించాడు. సీనియర్లు విలియమ్స్‌, ఇర్విన్‌, సికిందర్‌ రజాలతో మాట్లాడి వారి బాధ్యతలను గుర్తించేలా చేశాడు. తమ ఆటతో యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాలన్న అతడి మాటలు వాళ్లపై బాగా పని చేశాయి. ముఖ్యంగా సికిందర్‌ రజా అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగాడు.

టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2015లో వన్డేల్లో తొలి సెంచరీ చేసిన రజా ఈ ఒక్క ఏడాదిలోనే ఈ ఫార్మాట్లో 5 శతకాలు బాదడం విశేషం. ఇర్విన్‌, సీన్‌ విలియమ్స్‌ కూడా బాధ్యతగా ఆడుతున్నారు. ''కోచ్‌గా అడుగుపెట్టినప్పుడు జింబాబ్వే క్రికెట్‌ అస్తవ్యస్తంగా ఉంది. సీనియర్లు మేం ఆడమని మొండికేశారు. వారిని బుజ్జగించి మళ్లీ గాడిలో పెట్టాల్సి వచ్చింది. కుర్రాళ్లకు తాము సత్తా చాటగలమన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. 2022 టీ20 ప్రపంచకప్‌కు జింబాబ్వే అర్హత సాధించడం నా కల. మా ఆటగాళ్లు ఆ కలను నెరవేర్చారు. ఎంగరా, బర్ల్‌, చటార, జాంగ్వి లాంటి ఎందరో యువ కెరటాలు జింబాబ్వే క్రికెట్‌ ఎదుగుదలకు కారణమవుతున్నారు'' అని లాల్‌చంద్‌ చెప్పాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.