Begin typing your search above and press return to search.

పరిటాల రవి హత్య వేళ అనంత ఎస్పీగా ఉన్న ప్రవీణ్ తాజాగా ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   1 Nov 2021 5:02 AM GMT
పరిటాల రవి హత్య వేళ అనంత ఎస్పీగా ఉన్న ప్రవీణ్ తాజాగా ఏం చెప్పారు?
X
వారాని కో ప్రముఖుడ్ని కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తున్న ఎబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. సంచలన అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. కొంత కాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత.. తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమాన్ని పున: ప్రారంభించిన ఆయన.. వారాని కో ప్రత్యేకం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ను ఇంటర్వ్యూ చేశారు.

సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉంటూ.. ప్రభుత్వ తీరు నచ్చక తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన.. ప్రస్తుతం బీఎస్పీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎస్ అధికారిగా ఉంటూ ఆయన ప్రారంభించిన స్వేరో సంస్థ.. దాన్ని పెంచి ఎంతో మంది పేదలకు అండగా నిలిచిన ప్రవీణ్ కుమార్.. తాను అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్న వేళలో జరిగిన పరిటాల రవి హత్య ఉదంతం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

పరిటాల రవి హత్య సమయం లో అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్న ప్రవీణ్ మీదా ఆరోపణలు వచ్చాయి. హత్య కు పరోక్షం గా సహకారం ఇచ్చినట్లు గా ఉన్న ఆరోపణల్ని ఖండిస్తూ.. అవన్నీఅవాస్తవాలని తేల్చి చెప్పారు. పరిటాల రవి హత్య కేసు ను దర్యాప్తు చేసింది సీబీఐ అని.. పరిటాల ప్రాణాల కు ముప్పు ఉందన్న విషయాన్ని చాలా మంది చాలా రోజులుగా చెబుతున్నారన్నారు. రవి తనకు కూడా ఫిర్యాదు చేశారని.. తాను ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు.

ఎస్పీగా తన బాధ్యతను నిర్వర్తించానని.. ఆ విషయం లో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమని.. హత్య జరిగిన తర్వాత తాను దర్యాప్తు మాత్రమే చేయగలనని చెప్పారు. తన హత్యకు కుట్ర జరుగుతున్నట్లు పరిటాల రవికి కూడా తెలుసని.. తాము కూడా ఎన్నోసార్లు చెప్పినట్లు చెప్పారు. తాను ప్రాణాల్ని ప్రేమించే మనిషినని చెప్పారు.