Begin typing your search above and press return to search.

కేసీఆర్ మార్కెటింగ్ ట్రిక్స్ చూసి అవాక్క‌వాల్సిందే

By:  Tupaki Desk   |   30 March 2018 8:08 AM GMT
కేసీఆర్ మార్కెటింగ్ ట్రిక్స్ చూసి అవాక్క‌వాల్సిందే
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. రాజ‌కీయాల్లో ఉద్ధండులు అనే నాయ‌కుల‌ను కూడా త‌న చాణ‌క్యంతో ఒప్పించడం తెలంగాణ‌కు అనుకూలంగా వాళ్ల రాజ‌కీయ అడుగుల‌కు నవేయించ‌డంలో కేసీఆర్ విజ‌యం సాధించార‌నేది మెజార్టీ రాజ‌కీయ‌వ‌ర్గాల అభిప్రాయం. రాష్ట్రం ఏర్ప‌డిన అనంత‌రం త‌న వ్యూహాల‌తో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ `బంగారు తెలంగాణ` పేరుతో త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు సంచ‌ల‌న‌ - అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. అలాంటి అనూహ్య నిర్ణ‌యాల కార‌ణంగా చేస్తున్న ప‌నులు - వ‌స్తున్న ఫ‌లితాల‌ను మార్కెటింగ్ చేసుకునే ప‌నిలో కేసీఆర్ బిజీగా ఉన్నార‌ని అంటున్నారు. ఈ బాధ్య‌త‌ల‌ను త‌న మేన‌ల్లుడు - పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్ అనే పేరున్న మంత్రి హ‌రీశ్ రావుకు అప్ప‌గించార‌ని తెలుస్తోంది.

కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యాల్లో ప్రాజెక్టుల రీడిజైనింగ్ ప్ర‌ధానంగా చెప్పుకోవచ్చు. అలాంటి కీల‌క నిర్ణ‌యం వ‌ల్ల రాబోయే ప్ర‌తిష్టాత్మ‌క ఫలితంగా కాళేశ్వ‌రంను చెప్పుకోవ‌చ్చు. అంత‌కుముందు ప్ర‌తిపాదించిన ప్రాణ‌హిత‌-చేవెళ్ల‌ను ప‌క్క‌న‌పెట్టేసి ఈ భారీ ఎత్తిపోత‌ల పథ‌కానికి కేసీఆర్ శ్రీ‌కారం చుట్టారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది. దానికి మ‌రింత పాపులారిటీ ద‌క్కించేందుకు కేసీఆర్ మార్కెటింగ్ వ్యూహాల‌ను అవ‌లంభిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా జార్ఖండ్ మాజీ ముఖ్య‌మంత్రిని అక్క‌డ ప‌ర్య‌టించేలా చేశారు. ఈ బాధ్య‌త‌లు మంత్రి హరీశ్‌ రావుకు అప్ప‌గించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బరాజ్‌ ను జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సందర్శించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు - అధికారులు ఆయన వెంట ఉన్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రి హరీశ్‌ రావు - నీటిపారుదల శాఖ అధికారులు సోరెన్‌ కు వివరించారు. అనంతరం అక్కడి నుంచి అన్నారం బరాజ్ సందర్శనకు బయలుదేరారు. ఇలా పొరుగు రాష్ర్టాల్లో కూడా త‌న ప్రాజెక్టుల వ్యూహాల‌ను చ‌ర్చించుకునేలా కేసీఆర్ అద్భుత‌మైన మార్కెటింగ్ టెక్నిక్‌ ను అనుస‌రిస్తున్నార‌ని అంటున్నారు.