Begin typing your search above and press return to search.

ఆంధ్రుల తరఫున కేసీయార్......?

By:  Tupaki Desk   |   18 Feb 2022 5:30 PM GMT
ఆంధ్రుల తరఫున కేసీయార్......?
X
కేసీయార్ ని గులాబీ బ్యాచ్ తెలంగాణా జాతిపిత అంటుంది. అసాధ్యమైన తెలంగాణాను సుసాధ్యం చేసిన కేసీయార్ ని ప్రత్యర్ధులు కూడా మెచ్చుకుని తీరుతారు.

కేసీయార్ ది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. ఆయన ఎంపీ, ఎమ్మెల్యే, కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్ గా సైతం పనిచేశారు. ఇదంతా రాజకీయ పార్శ్యం అయితే, ఆయన ఉద్యమ పంధా వేరేగా ఉంటుంది. ఆయన ఎత్తులకు పై ఎత్తులకు చిత్తు కాని వారు అక్కడ ఎవరూ లేరు.

అలా ఒంటి చేత్తో తెలంగాణాను ఆయన సాధించారు. అలాంటి కేసీయార్ విడిపోయినా కలిసుందామనే అంటూంటారు. ఆంధ్రులు కూడా అన్నదమ్ములే అని చెబుతారు. మరి కేసీయార్ అన్యాయమైపోతున్న ఆంధ్రుల తరఫున పోరాడితే ఎలా ఉంటుంది, ఆయన ఒక రాష్ట్రాన్నే సాధించిన మేటి, ఘనాపాఠి. అలాంటిది ఏపీలో ప్రత్యేక హోదా సహా అనేక సమస్యలు ఉన్నాయి. విభజన గాయాలు కూడా ఉన్నాయి.

కేంద్రం అడ్డగోలుగా ఏపీని విభజించి అన్యాయం చేసింది అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. ఆయనే స్వయంగా మరో వైపు కేసీయార్ బీజేపీని ఎదిరిస్తున్నారు కదా, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాను అని అంటున్నారు కదా, ఏపీకి జరిగిన అన్యాయం మీద గళెమెత్తి కేంద్రం మీద పోరు చేయాలని కోరుతున్నారు.

నిజానికి ఉండవల్లి కోరిన ఈ కోరిక కూడా ఎలా చూసుకున్నా చాలా మంచిదే, కేసీయార్ కి ఏపీ జనాల మద్దతు కూడా ఉంటుంది. ఆయనకు దేశంలోని ఇతర రాష్ట్రాల మద్దతు సంగతి పక్కన పెడితే సాటి తెలుగు రాష్ట్రం మద్దతు ఎంతో విలువైనది, నైతికపరమైనది. మరి ఆ దిశగా కేసీయార్ ఆలోచిస్తారా. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పుకోవాలి.

కేసీయార్ పూర్వీకులు ఉత్తరాంధ్రా వాసులు అని కూడా అప్పట్లో అంటే తెలంగాణా ఉద్యమ వేళ రకరకాలుగా ప్రచారం జరిగింది. వారంతా తరువాత కాలంలో తెలంగాణాలో సెటిల్ అయ్యారని కూడా అంటారు. మొత్తానికి చూస్తే కేసీయార్ లో ఆంధ్రా మూలాలు ఉన్నాయని అంటారు. దానిని మించి ఆంధ్రుల మీద ఆయనకు ప్రేమ ఉంది. మరి ఈ అభిమానంతో అయినా ఆయన ఏపీ ప్రజల సమస్యలను భుజానికెత్తుకోవాలని కోరుతున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే కేసీయార్ ఏపీ సమస్యల మీద పోరాడితే ఏపీ ప్రజలు అంతా వెన్నటి ఉంటారు, హర్షిస్తారు. ఇపుడు కేసీయార్ లేవనెత్తుతున్న అనేక సమస్యలు కూడా కేంద్రం లోని పెద్దల ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగానే కాబట్టి ఏపీకి ఈనాటికి జరుగుతున్న అన్యాయం మీదనే ఆయన తొట్ట తొలి పోరాటం మొదలుపెడితే కేసీయార్ తెలంగాణా జాతిపిత నుంచి జాతీయ నాయకుడు గా మారుతారు.

అంతే కాదు, రేపటి రోజున ఢిల్లీలో ప్రధాని రేసులో నంబర్ల గేమ్ లో సైతం కేసీయార్ అగ్ర భాగాన నిలుస్తారు. ఎలా అంటే రెండు తెలుగు రాష్ట్రాలూ కలుపుకుని 42 ఎంపీ సీట్లు ఉంటాయి. మొత్తానికి ఉండవల్లి మాస్టారు చెప్పినట్లుగా కేసీయార్ ఏపీ వైపు చూడాల్సిందే అని అంతా అంటున్నారు. మరి గులాబీ బాస్ ఏమంటారో.