Begin typing your search above and press return to search.

బాబు లైన్ కు భిన్నంగా తెలుగు తమ్ముడి వ్యాఖ్య

By:  Tupaki Desk   |   17 Dec 2021 9:30 AM GMT
బాబు లైన్ కు భిన్నంగా తెలుగు తమ్ముడి వ్యాఖ్య
X
అమరావతిని రాజధానిగా ప్రకటించాలని.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ముగియటం.. ఈ రోజు (శుక్రవారం) తిరుపతిలో బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రను టీడీపీ వర్గాలు దగ్గరుండి నిర్వహించినట్లుగా ఏపీ అధికారపక్షం ఆరోపిస్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లుగా రిపోర్టులు వస్తున్నాయి.

ఒకవేళ.. టీడీపీ వెనుకుండి నడిపిస్తే.. ఇలా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కు కౌంటర్ గా రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి పేరుతో కొత్త రాజకీయం గురువారం తిరుపతి వీధుల్లో దర్శనమిచ్చింది.

అయితే.. సదరు ర్యాలీలో పాల్గొన్న వారంతా విద్యార్థులు కావటం.. తమ డిమాండ్ అమరావతికే రాజధాని ఇవ్వాలంటూ వారు చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య.. చంద్రబాబుకు షాకిచ్చేలా ఉంది. ఏపీ రాజధానిగా అమరావతినే ఫిక్సు చేయాలంటూ అధికార పక్షాన్ని డిమాండ్ చేస్తున్న టీడీపీ తీరుకు భిన్నంగా అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.

తిరుపతిలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన.. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని పేర్కొనటం గమనార్హం. సచివాలయాన్ని వైజాగ్ లో కాకుండా రాయలసీమలో ఏర్పాటు చేయాలని.. తద్వారా కర్నూలు.. తిరుపతి.. కడప ఏదో ఒక చోట రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ వాసులుగా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతామని పేర్కొనటం విశేషం.

ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. సెక్రటేరియట్ ను విశాఖపట్నంలో పెడతానని సీఎం జగన్ అంటున్నారని.. అసెంబ్లీని అమరావతిలో పెడతానని.. కోర్టును తీసుకొచ్చి రాయలసీమలో పెడుతున్నట్లు చెప్పారని.. దీని వల్ల సీమ వాసులకు లాభం ఏమిటి? అని ప్రశ్నించారు. రాజధాని అన్నది ఒకే ప్రాంతంలో ఉండాలని.. సీమ ప్రాంతానికి ఏం చేస్తారో జగన్ చెప్పాలన్నారు.

సీమను పారిశ్రామికంగా డెవలప్ చేయాలని చంద్రబాబు కంపెనీల్ని తీసుకొచ్చారని.. కానీ ఈ రోజున ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి రాజధాని నగరాన్ని నిర్మించే ఆలోచన ఉందా? అని ప్రశ్నించిన అమర్నాథ్ రెడ్డి.. రాష్ట్రానికి రాజధాని అవసరమన్నారు.

అన్నీ ఒకే చోట ఉండాలన్న ఆయన తిరుపతిలో అమరావతి రాజధానిగా మద్దతు ఇచ్చే సభకు వచ్చి ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. కీలక అంశాల విషయంలో ఒకే మాట మీద నిలబడాల్సిన వేళ.. అందుకు భిన్నంగా వ్యవహరించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమర్నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ఇరుకున పడేలా ఉన్నాయని చెప్పక తప్పదు.