Begin typing your search above and press return to search.

సైకిల్ మీద ఆన : ఆనం వారి ఒప్పందం ఇదేనా...?

By:  Tupaki Desk   |   30 May 2022 12:30 PM GMT
సైకిల్ మీద ఆన : ఆనం వారి ఒప్పందం ఇదేనా...?
X
నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దాయన, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి భవిష్యత్తు రాజకీయం ఏంటో డిసైడ్ అయిపోయిందా. ఇన్నాళ్ళూ ముసుగులో గుద్దులాటగా సాగిన వ్యవహారం కాస్తా బట్టబయలు అవుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అదే నిజమని చెబుతున్నాయి. సడెన్ గా మహానాడు వేళ ఆనం రామ నారాయణరెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి నారా లోకేష్ తో భేటీ వేయడం వెనక ఆనం వారి భారీ పొలిటికల్ స్కెచ్ ఉందని అంటున్నారు.

ముందు కూతురుని పంపి టీడీపీలో బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్న ఆనం ఫ్యామిలీ వచ్చే ఎన్నికలలో కచ్చితంగా సైకిలెక్కుతుందని అంటున్నారు. దానికి సంబంధించిన‌ పూర్వరంగం సిద్ధం అయిందని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం వెంకటగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ మీద అంతకంతకు ప్రేమను పెంచుకుంటూనే ఉన్నారు. ఆయన విభజన తరువాత కాంగ్రెస్ చితికిపోతే ఎంచుకున్న ఫస్ట్ ఆప్షన్ టీడీపీనే.

అయితే అప్పట్లో రాజకీయ సమీకరణల వల్ల ఆయనకు ఎమ్మెల్యే ఇవ్వలేకపోయారు. ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా ఆనం కి మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆనం అక్కడ ఇమడలేకపోయారు. మొత్తానికి ఆనం 2018లో విజయనగరంలో జగన్ పాదయాత్ర చేస్తున్న వేళ తన అనుచరులతో వచ్చి కలసి మరీ వైసీపీ కండువా కప్పుకున్నారు.

ఇక ఆయన అనుకున్నట్లుగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆనం కి మాత్రం మంత్రి పదవి దక్కలేదు. దాంతో తీరని అవమానంగా దాన్ని భావించిన ఆనం వారు వీలు దొరికినపుడల్లా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వచ్చేవారు. ఇన్నాళ్ళకు ఇపుడు ఆయన సైకిలెక్కేందుకు రెడీ అవుతున్నారు అని ప్రచారం ఊపందుకుంది.

దాంతో టీడీపీ పెద్దలతో ఆనం వారి ఫ్యామిలీకి ఒప్పందం జరిగింది అని కూడా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారం మేరకు ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యారెడ్డికి వచ్చే ఎన్నికల్లో అత్మకూరు టికెట్ కన్ ఫర్మ్ చేస్తారు. అదే విధంగా దివంగత ఆనం వివేకానందరెడ్డి వారసులకు నెల్లూరు సిటీ సిటీకి కేటాయిస్తారు.

ఇలా ఆనం బ్రదర్స్ వారసులు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీకి దిగుతారు అన్న మాట. ఇక ఆనం రామనారాయణరెడ్డి వారసులు రెండు సీట్లలో గెలిచేలా బాధ్యత తీసుకుంటారు. అదే సమయంలో నెల్లూరు జిల్లాలో పది సీట్లలో కూడా టీడీపీ విజయానికి ఆయన వంతుగా పనిచేస్తారు. ఆయన మాత్రం పోటీకి దూరంగా ఉంటారు.

ఆ తరువాత టీడీపీ గెలిస్తే ఆనం కి కచ్చితంగా ఒక పెద్ద పదవి ఇస్తారని అంటున్నారు. ఈ మేరకు ఆనం ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇచ్చేలా, ఆనం కి పెద్ద పదవి ఇచ్చేలాగానూ ఒక కీలకమైన ఒప్పందం అయితే కుదిరింది అంటున్నారు. దాంతోనే ముందుగా కైవల్యారెడ్డి ప్లాన్ ప్రకారమే నారా లోకేష్ ని కలిశారు అంటున్నారు.

తొందరలోనే ఆనం వివేకాందరెడ్డి ఫ్యామిలీ నుంచి వారసులు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది అంటున్నారు. సరైన సమయం చూసి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీతో తన బంధాలను తెంచుకుని రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. మొత్తానికి నెల్లూరు రాజకీయాలలో ఆనం ఫ్యామిలీ మార్క్ పాలిటిక్స్ తో ప్రకంపనలు రేగుతున్నాయి. ఆనం ఫ్యామిలీ అటు నిలబడితే వైసీపీకి రాజకీయంగా నష్టమే అంటున్నారు. చూడాలి మరి దీనిని ఎలా తట్టుకుంటారో.