Begin typing your search above and press return to search.

అన్న గారి కోసం : వైసీపీ మాజీ మంత్రి నివాళి

By:  Tupaki Desk   |   28 May 2022 9:30 AM GMT
అన్న గారి కోసం : వైసీపీ మాజీ మంత్రి నివాళి
X
వైసీపీకి టీడీపీకి ఉప్పూ నిప్పులా రాజకీయం ఉంది అన్న సంగతి తెలిసిందే. అది ఎంతవరకూ వెళ్ళింది అంటే విజయవాడకు ఎన్టీయార్ పేరు పెట్టినా కూడా అభినందించలేని స్థితికి. మొత్తానికి చూస్తే వైసీపీ వారికి వైఎస్సార్ దేవుడు అయితే టీడీపీ వారికి ఎన్టీయార్ దేవుడు. ఇలా తెలుగు జాతి నాయకులను కూడా పార్టీలుగా విభజించి పంచుకుంటున్న పరిస్థితి. ఈ నేపధ్యం ఇలా ఉంటే వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ఎన్టీయార్ కి ఘన నివాళి అర్పించారు అంటే అది నిజంగా వార్తే కదా.

అనకాపల్లి జిల్లాకు చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన క్యాంప్ ఆఫీస్ లో ఎన్టీయార్ చిత్రపటానికి దండ వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన కీలకమైన కామెంట్స్ చేశారు. ఎన్టీయార్ కి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్రాన్ని మోడీని డిమాండ్ చేశారు.

కళా రంగంలో ఎమ్జీయార్ తరువాత దక్షిణాదిన మరొకరికి భారతరత్న ఇవ్వలేదు అని ఆయన గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో ఎన్టీయార్ విఖ్యాతిని, ఆయన తెలుగు జాతికి చేసిన సేవను గుర్తుపెట్టుకుని భారతరత్నను ప్రకటించాలని కోరారు. ఇక ఎన్టీయార్ ని ఎన్నికల సమయంలోనే టీడీపీ వాడుకుంటోంది అని దాడి మండిపడ్డారు.

విజయవాడకు ఎన్టీయార్ పేరు పెడితే కనీసం అభినందించలేని దుస్థితిలో టీడీపీ అధినాయకత్వం ఉంది అన్నారు. మరో వైపు చూస్తే కేసీయార్ హైదరాబాద్ లో ఎన్టీయార్ మ్యూజియం ని ఏర్పాటు చేసి ఆయన ఘాట్ ని అతి పెద్ద జ్ఞాపకంగా రూపొందించాలని దాడి కోరారు. ఆ మ్యూజియం లో ఎన్టీయార్ నటించిన వివిధ పాత్రలను పంచ లోహాలతో తయారు చేయించి భావి తరాలకు వాటి స్పూర్తిని అందచేయాలని కోరారు.

ఎన్టీయార్ అందరివాడు అని ఆయన పేదల దేవుడు అని దాడి కొనియాడారు. ఇదిలా ఉంటే దాడి వీరభద్రరావు ఒకనాడు టీడీపీవారే. ఆయన ఎన్టీయార్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి చేరారు. ఆయనకు ఎన్టీయార్ అనేక సార్లు మంత్రి పదవిని కట్టబెట్టారు. ఆయన చంద్రబాబు వ్యతిరేక వర్గంగా నాడు ఉండేవారు. అప్పట్లో విశాఖ జిల్లాలో అయ్యన్నపాత్రుడు చంద్రబాబు వర్గంగా పేరు గడించారు. మొత్తానికి చూసుకుంటే ఎన్టీయార్ ని పొగుడుతూ వైసీపీ మాజీ మంత్రి ఆయన పేరిట కార్యక్రమాలు చేయడం మాత్రం వర్తమానంలో చూస్తే రాజకీయ చిత్రంగానే అంతా చూస్తున్నారు.