Begin typing your search above and press return to search.

ఆయనకు మంత్రి.. ఈయన జనసేనలోకి...?

By:  Tupaki Desk   |   31 March 2022 11:30 PM GMT
ఆయనకు మంత్రి.. ఈయన జనసేనలోకి...?
X
ఉత్తరాంధ్రా జిల్లాలలో జనసేనకు మంచి రోజులు రాబోతున్నాయి. అంతకంతకు ఆ పార్టీకి ఆదరణ పెరుగుతున్న వేళ వివిధ పార్టీల నుంచి నేతల చూపు జనసేన మీద పడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలోనూ జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదురుతుందని అంతా భావిస్తున్నారు. ఆవిర్భావ సభలో పవన్ నుంచి ఈ మేరకు సానుకూలమైన ప్రకటన రావడంతో ఇంతకాలం వైసీపీలో అసంతృప్తిగా ఉంటూ వస్తున్న నేతలకు ఒక చోటు దొరికినట్లు అయింది.

ఉత్తరాంధ్రా జిల్లాలలో చూసుకుంటే సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు త్వరలోనే జనసేన కండువా కప్పుకుంటారన్న ప్రచారం అయితే గుప్పుమంటోంది. ఈ మాజీ మంత్రి ఎన్టీయార్ హయాం నుంచి రాజకీయాల్లో ఉన్న వారు. పలు మార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత. ఇక ఎమ్మెల్సీగా, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆరేళ్ల పాటు సేవలు అందించిన దాడికి మంచి వాగ్దాటి ఉంది.

ఆయన విశాఖ జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. ఇక దాడి అటు వైసీపీ ఇటు టీడీపీలలో తిరుగుతూ వస్తూండడం వల్లనే ఆయనకు వైసీపీలో ఏ పదవీ ఇవ్వలేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే తన కంటే జూనియర్లను ఎమ్మెల్సీలుగా చేసి తనకు పెద్దల సభకు అవకాశం ఇవ్వలేదని చాలాకాలంగా దాడి అలిగి ఉన్నారు.

ఇక తన రాజకీయ వారసుడిగా ఉన్న కుమారుడు దాడి రత్నాకర్ కి కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న నామినేటెడ్ పదవి అయినా ఇవ్వలేదని అంటున్నారు. మరో వైపు తాము తీవ్రంగా వ్యతిరేకించే గుడివాడ అమరనాధ్ కి మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధపడడం కూడా ఈ తండ్రీ కొడుకులకు కంటగింపుగా ఉందని అంటున్నారు.

అందుకే అటు గుడివాడ మంత్రిగా ప్రమాణ స్వీకారం రోజునే ఇటు పార్టీకి గుడ్ బై కొట్టి అనకాపల్లి జిల్లాలో కొత్త మంత్రికి అపశకునంతో స్వాగతం పలకాలని పక్కాగా ప్లానింగ్ చేశారని అంటున్నారు.

ఇక దాడి ఫ్యామిలీ జనసేనలో చేరుతారు అని తెలుస్తోంది. అప్పట్లో అంటే 2018 ప్రాంతంలో విశాఖ టూర్ లో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ దాడి వీరభద్రరావు ఇంటికి స్వయంగా వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే నాడు ఆయన ఆహ్వానాన్ని పక్కన పెట్టి మరీ వైసీపీలో దాడి కుటుంబం చేరిపోయింది.

అయితే ఈసారి మాత్రం జనసేనలోకే మా పయనం అంటోంది. మరి దీని మీద పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరో వైపు టీడీపీలోకి వెళ్ళాలని ఉన్నా అక్కడ దాడి వ్యతిరేక వర్గం బలంగా ఉంది. పైగా అనకాపల్లి టికెట్ ఆయన కుమారుడికి దక్కకపోవచ్చు. అందుకే జనసేనలో చేరి పొత్తులలో భాగంగా సీటును అందుకోవాలని చూస్తున్నారుట. మొత్తానికి జనసేనలో దాడి ఫ్యామిలీ చేరితే ఉత్తరాంధ్రా జిల్లాలలో తొలి జంపింగ్స్ అనకాపల్లి నుంచే స్టార్ట్ అంటున్నారు.