Begin typing your search above and press return to search.

సర్కార్ ఫెయిలేనా : గ్రేస్ మార్కులు ఇవ్వాల్సిందే అంటున్న వైసీపీ మాస్టారు

By:  Tupaki Desk   |   12 Jun 2022 11:52 AM GMT
సర్కార్ ఫెయిలేనా  : గ్రేస్ మార్కులు ఇవ్వాల్సిందే అంటున్న వైసీపీ మాస్టారు
X
ఇప్పటిదాకా టెన్త్ ఫలితాల మీద విమర్శలు కానీ సూచనలు కానీ విపక్షాల నుంచే వచ్చాయి. కానీ ఇపుడు ఫస్ట్ టైమ్ వైసీపీ నట్టింట పదవతరగతి పరీక్షా ఫలితాల మీద రచ్చ సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టెన్త్ పరీక్షా ఫలితాల ఉత్తీర్ణతా శాతం పడిపోయింది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పూర్వాశ్రమంలో మాస్టారుగా పనిచేసిన దాడి వీరభద్రరావు అంటున్నారు. ఇది చాలా బాధాకరమని కూడా ఆయన పేర్కొన్నారు.

టెన్త్ ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగాయని ఆయన అన్నారు. గత పదేళ్ల కాలంలో సగటున చూస్తే 83 శాతం కంటే ఉతీర్ణత త‌క్కువగా ఫలితాలు ఎపుడూ రాలేదు అని గుర్తు చేశారు. కరోనా కారణంగా విద్యార్ధులు చదువుకు దూరం అయ్యారని అన్నారు. అలాగే ఆన్ లైన్ తరగతులు కూడా అందరికీ లభించలేదని, చాలా మందికి లాప్ టాప్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ లేవని పేర్కొన్నారు.

ఇక ఆన్ లైన్ చదువుకు కంటే ప్రత్యక్ష బోధన అవసరం అని అది ఈసారి కరవు కావడం కూడా టెన్త్ ఫలితాల మీద ప్రభావం చూపించింది అని అన్నారు. ఈసారి పరీక్షలలో బిట్ పేపర్లు తీసేయడం, చాయిస్ తగ్గించడం, కొత్త పరీక్షా విధానం అమలు చేయడం వల్ల కూడా టెన్త్ పరీక్షలలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారని దాడి విశ్లేషించారు.

అదే విధంగా మారిన పద్ధతిని వివరిస్తూ మోడల్ పేపర్లను ముందుగా విడుదల చేసినా విద్యార్ధులకు ఉపయోగంగా ఉండేది అని అన్నారు. అలా చేయకపోవడం వల్ల ఉత్తీర్ణత మీద ప్రభావం పడింది అని అన్నారు. ఈ విషయంలో జగన్ పెద్ద మనసు చేసుకుని పదవతరగతి ఫెయిల్ అయిన విద్యార్ధులకు 10 గ్రేస్ మార్కులు కలపాలని ఆయన కోరారు. దాని వల్ల చాలా మాంది పాస్ అయ్యే అవకాశం ఉంది అన్నారు

ఈ విషయంలో విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తన పలుకుబడిని ఉపయోగించి ముఖ్యమంత్రి మనసు మార్చే ప్రయత్నం చేయాలని దాడి కోరడం విశేషం. మొత్తానికి వైసీపీ నుంచి ఫస్ట్ టైమ్ అది కూడా ఒక సీనియర్ నాయకుడు టెన్త్ జరిగిన తీరు మీద కొంత విమర్శలతోనే మాట్లాడారు అని అంటున్నారు.

దాడికి వైసీపీలో ఏ పదవులూ లేకపోవడం తో ఆయన ప్రభుత్వ పాలసీల మీద తన అసంతృప్తిని పదే పదే వెల్లడిస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు ఆయన టెన్త్ పరీక్షలలో పోయిన విద్య్యార్ధులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలన్న తాజా డిమాండ్ తో వైసీపీ సర్కార్ ని ఇరకాటంలో పెట్టేశారు. అదే టైమ్ లో విపక్షాల డిమాండ్ సరైనదే అని చాటారు. మరి దీని మీద వైసీపీ పెద్దలు ఎలా ఆలోచిస్తారో.