Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ మృతి

By:  Tupaki Desk   |   29 July 2019 10:00 AM GMT
మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ మృతి
X
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్‌ గౌడ్‌ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 60 ఏళ్ల ముఖేశ్ గౌడ్ గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌ తో బాధపడుతున్నారు. కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో వైద్యులు సూచన మేరకు మధ్యలో ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి ఆయన్ను మళ్లీ అపోలో చేర్చారు. ఆదివారం రాత్రి ఆయన మరణించినట్లుగా ప్రచారం జరగ్గా కుమారుడు విక్రమ్ గౌడ్ ఆ వార్తలను ఖండించారు. తన తండ్రి పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ ఆయన చనిపోలేదని స్పష్టం చేశారు.

అప్పటి నుంచి ముఖేశ్‌ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినప్పటికీ శరీర అవయవాలు చికిత్సకు స్పందించకపోవడంతో మధ్యాహ్నం మరణించారు. ముఖేష్‌ గౌడ్‌ మృతిపట్ల కాంగ్రెస్‌ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖేష్‌ గౌడ్‌.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కేబినెట్‌ లో మంత్రిగా పని చేశారు. 2009లో గెలిచిన తర్వాత వైఎస్‌ కేబినెట్‌ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

సుమారు ఏడు నెలలుగా క్యాన్సర్‌ కు చికిత్స తీసుకుంటున్న ఆయన మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషా మహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ ఆయన అంబులెన్సులో వచ్చి ఓటేశారు. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో అనుచరులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన కోలుకుంటారని వారంతా ఆశించినప్పటికీ వారందరినీ దు:ఖంలో ముంచుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.